ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరో నా వైరస్‌ను కట్టడి చేసే యత్నంలో భాగంగా భారత్‌లో విధించిన లాక్‌డౌన్ గడువు ఈనెల 14తో ముగియనుంది. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉద యం 10 గంటలకు లాక్‌డౌన్‌పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించాలంటూ ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపుకు సంబంధించి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెలలో ప్రధాని రెండుసార్లు మార్చి 19, మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్‌పై పోరాడేందుకు సంకల్పం, నిగ్రహంతో ఉండాలని మార్చి 19న ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సూచించారు. అదే విధంగా కరోనాకు చెక్ పెట్టేందుకు దేశ వ్యాప్తంగా లాకౌడ్‌న్ విధిస్తున్నట్లు మార్చి 24న ప్రధాని ప్రకటన చేశారు. ఏప్రిల్ 5న ప్రజలందరూ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు తమ ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, క్యాండిల్స్, మొబైల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించాలని ఏప్రిల్ 3న వీడియో సందేశం ద్వారా ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్ దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.