ప్రజాసమస్యలపై పోరాటాలు, పార్టీ విస్తరణకు బహుముఖ కార్యాచరణ లక్ష్యం
ప్రజాపక్షం / హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభ ఆదివారం నుండి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు జరిగే మహాసభలో గత మహాసభల నుండి నేటి వరకు జరిగిన కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తారు. వచ్చే మూడేళ్లకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. దేశంలో మతోన్మాదం పెచ్చుమీరి, ప్రమాదకరస్థాయి చేరి న నేపథ్యంలో, రాష్ట్రంలో బిజెపి పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభ ప్రాధాన్యత సంతరించుకున్నది. మహాసభ ప్రారంభ సూచికగా జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లేగ్రౌండ్ (కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వర్లు మైదాన్) లో ఆదివారం మధ్యాహ్నం మూడు గం టలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఇన్‌ఫాంట్ జీసెస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి జెడ్‌పిహెచ్‌ఎస్ హైస్కూల్ వరకు వేలాది రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో భారీ ప్రదర్శన నిర్వహించనున్నా రు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగసభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం ఆయన నేరుగా కోల్‌కత్తా నుండి శంషాబాద్‌కు చేరుకోనున్నారు. బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజాన్, బినోయ్ విశ్వం, డాక్టర్ కె. నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తారు. కాగా, ఈ నెల 5వ తేదీ నుండి శంషాబాద్‌లోని ‘కామ్రేడ్ గుండా మల్లేశ్ నగర్’ (మల్లికా కన్వెన్షన్ హాల్)లో ప్రతినిధుల సభ ప్రారంభమౌతుంది. ఆరోజు ఉదయం పది గంటలకు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరు ల స్థూపాన్ని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. తరువాత డి.రాజా ప్రారంభోపన్యాసంతో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. ప్రారంభ సభలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సౌహార్థ సందేశాలిస్తారు. సిపిఐ పోరాటాలు, అలనాటి మహోజ్వల తెలంగాణ సాయుధ పోరాట చరిత్రతో మహాసభ ప్రారంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అతుల్ కుమార్ అంజాన్ ప్రారంభిస్తారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం ప్రతినిధుల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కార్యదర్శి నివేదకను చర్చకు ప్రతిపాదిస్తారు. మూడు రోజుల పాటు నివేదికపై చర్చించి, మార్పులు, చేర్పులతో ఆమోదిస్తారు. చివరి రోజైన బుధవారంనాడు నూతన రాష్ట్ర సమితి ఎన్నిక జరుగుతుంది. దేశంలో ఇప్పుడు మతోన్మాదం పెచ్చరిల్లుతూ పాలకులే దీనికి దన్నుగా నిలుస్తున్న పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు జరుగుతున్నాయి. మతోనాదాన్ని ప్రధమ శత్రువుగా ఎంచుకుని దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతున్నది. అంతిమ లక్ష్యం సమ సమాజం సాధనలో ప్రజలను చైతన్యం చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్‌లో జరగనున్నాయి. ఇప్పటికే గ్రామశాఖ మొదలు మండల, పట్టణ, నగర, జిల్లా మహాసభలను పూర్తి చేసుకుని రాష్ట్ర మహాసభలకు సిద్ధమైంది. సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు, భారతదేశ భవిష్యత్తు, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. మహాసభల జయప్రదం కోరుతూ విస్తృత ప్రచారం జరిగింది. పడి లేవడం కమ్యూనిస్టు పార్టీకి కొత్తేమి కాదు. బలహీనపడిందన్న కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల వ్యాప్తిని నిరోధించే క్రమంలో ఉవ్వెత్తున మహోజ్వల పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించేందుకు అమరవీరుల స్ఫూర్తితో సన్నద్ధమౌతున్నది.
నేటి నుంచి సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు
RELATED ARTICLES