జాతీయ సమితి సమావేశాలు
తాజా రాజకీయ పరిణామాలు, రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఇండియా కూటమి తదితర అంశాలపై చర్చ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు మగ్ధూం భవన్లో జరిగే ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఇండియా కూటమి తదితర అంశాలు చర్చకు రానున్నాయన్నారు. దేశా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 150 మంది సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపారు. ఈ నెల 4న హైదరాబాద్‌లోని, అలాగే
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పాలస్తీనా సంఘీభావ సభ’ను నిర్వహిస్తామని, ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, టి.శ్రీనివాస్ రావు, ఎన్.బాలమల్లేష్, కలవేని శంకర్‌తో కలిసి హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివ రావు మాట్లాడారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషాతో పాటు జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు, జాతీయ సమితిసభ్యులు, కేరళ రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంఎల్ఎలు హాజరుకానున్నారని వివరించారు. జాతీయ సమావేశ ఏర్పాట్లను సయ్యద్ అజీజ్ పాషా,చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఒక్కో బాధ్యతలో నిమగ్నమయ్యారన్నారు. జాతీయ సమితి సమావేశంలో లోకసభ ఎన్నికలకు ఎలా ఎదుర్కొవాలి, సిపిఐ పాత్ర ఎలా ఉండాలి?, ఇండియా కూటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, రాజకీయ పరమైన చర్చ జరుగనుందని కూనంనేని వివరించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను పరిశీలించిన తర్వాత మతపరమై, రాజకీయ వివక్షతకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామన్నారు. ప్రజల చైతన్య స్థాయిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని, మతం వేరు, రాజకీయం వేరు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, అందుకు వీలుగా తమ కార్యాకలాపాలను రూపొందిస్తామని కూనంనేని అన్నారు. శ్రీరాముని పేరుతో ఓట్లు కొల్లగొట్టడం రామునికి అపచారం చేయడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. రామ జపంతో మొదలై మోడీ జపం వరకు వచ్చిందని,మోడీ ప్లెక్సీలే కనిపిస్తాయని విమర్శించారు. కెసిఆర్‌కు వేసే ప్రతి ఓటూ బిజెపికి పోయినట్టేనని, బిఆర్ఎస్ ఎంపి సీట్లు అక్కడికి(ఢిల్లీకి) వెళ్లిన తర్వాత బిజెపికే పోతాయని, ఎపిలో జగన్‌కు వే సిన ఓటు కూడా బిజెపికి వెళ్తాయన్నారు. నియంతలలో ఆధునీకతను జోడించి ప్రధాని మోడీ ఆధునీక, నయా నియంతగా మారాడాని విమర్శించారు. మతోన్మాదం, ఫాసిజం ఇలా మోడీలో అన్ని అవలక్షణాలూ ఉన్నాయని, ఆయన దేశాన్ని ఇష్టరాజ్యంగా పరిపాలిస్తున్నారన్నారు. అమయాక ప్రజల భక్తిని ఆధారంగా, ఆసరగా చేసుకుని మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీరాముని దేవాలయం మోడీ ప్రభుత్వానికి పట్టబోద న్నారు. మూడోసారి అధికారంలోనికి రావాలని తపన మాత్రమే ఉన్నదన్నారు. అడ్డమొచ్చినవారిని తొలగిస్తూ రాక్షసత్వంగా వ్యవహారిస్తున్నారన్నారన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఎలాం ఉంటాయోచూడాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కృష్ణానది , గోదావరి నిర్వహణ బాధ్యతను కేంద్రం బలవంతంగా తీసుకున్నదని, వీటికి బడ్జెట్ సమావేశాల్లో పరిష్కారం లభిస్తుందా? లేదా ? వేచి చూడాలన్నారు.కేంద్రంలోని బిజెపి దుర్మార్గ పాలనకు స్వస్తి పలుకాల్సిన అవసరం ఉన్నదన్నారు. బిజెపి దేశంలో అత్యంత ప్రమాదకరమ పార్టీగా మారిందని కూనంనేని సాంబశివరావు అన్నారు. అరాచకత్వంతో ఎదురుగా ఉన్న పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో నితీష్ కుమార్‌ను బెదరగొట్టి లొంగతీసుకున్నారని, మోడీకి అనుకూలంగా ఉన్న వారు రాజమార్గంలో ఉరేగింపులు చేసుకుంటున్నారని, జార్ఖాండ్ సిఎంను వెంటాడి అరెస్ట్ చేయించారని, లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం సిసోడియోకు ఇప్పటి వరకూ బెయిల్ రాలేదని,మోడీకి ఎవ్వరూ ఎదురుతిరిగి మాట్లాడొద్దని చెప్పారు. చివరికి అద్వానీని కూడా కనీసం అయోధ్య రామాలయ నిర్మాణానికి ఆహ్వానించిచలేదన్నారు.
‘కాళేశ్వరం’ అవినీతిని కక్కించాలె
కళాశ్వేరం ప్రాజెక్ట్ అవినీతిపై పుంకాలు పుంకాలుగా కథనాలు, ప్రచారం జరుగుతుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పనికి రాదని, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ పనికొస్తుందా?, లేదా? స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలను, అలాగే నిపుణుల కమిటీని కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్లాలని, ఆ ప్రాజెక్ట్‌లోని లోపాలు, కుంభకోణాలపై విచారణ చేపట్టాలని చెప్పారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుండే కక్కించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ శాసనసభ్యులు ఇచ్చే ఉత్తరాలను టిటిడి పరిగణలోకి తీసుకోవడం లేదని, మన డబ్బులు కూడా టిటిడిలో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ఎంఎల్ఎలు రాసే ఉత్తరాలను అంశాన్ని ఎపి ప్రభుత్వం సరిద్ధాలని, లేదంటే ఈ అంశంలో రాష్ట్రంతో పాటు తిరుపతిలో కూడా ఆందోళన చేస్తామని కూనంనేని హెచ్చరించారు.
నితీష్ కుమార్ ఒక ‘పల్టు’ రామ్: అజీజ్ పాషా
సిపిఐ జాతీయ సమితి సమావేశాల్లో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు, ఇండియా కూటమి తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇండియా కూటమి నుండి బిహార్ సిఎం నితీష్ కుమార్ వెళ్లిపోవడం, ఆయనను తిరిగి ఎన్‌డిఎ కూటమి ఆహ్వానించడం సిగ్గుచేటని మండిపడ్దారు. నితీష్ కుమార్ ఇప్పటికే తొమ్మిది సార్లు కూటమిలను మార్చారని, ఆయనొక ‘పల్టు రామ్’ అని ఎద్దేవా చేశారు.
నేటి నుంచి సిపిఐ
RELATED ARTICLES