నేటి నుంచి పార్లమెంట్‌

వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
18 రోజుల పాటు జరగనున్న సమావేశాలు
సభ్యులకు మాస్కులు తప్పనిసరి
ఎంపిలు, సిబ్బంది, జర్నలిస్టులకు కొవిడ్‌ పరీక్షలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వి-జృంభిస్తున్నప్పటికీ నేటి (ఈనెల 14) నుంచి 18 రోజుల వర్షాకాల సమావేశాలు నిర్వహించుకునేందుకు పార్లమెంట్‌ పూర్తి సంసిద్ధమైంది. ఎలాంటి విశ్రాంతి లేకుండా ఉభయసభలు షిఫ్టుల వారీగా సమావేశం కావడం, కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిన వారికి మాత్రమే పార్లమెంట్‌లోకి ప్రవేశం, మాస్కులు తప్పనిసరి వంటి చర్యలను మొట్టమొదటిసారిగా చేపట్టారు. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి పలు ప్రదేశాల నుంచి రియల్‌ టైమ్‌లో ఉభయసభలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించేందుకు ఎంపిలు, సిబ్బంది సహా 4 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఎక్కువశాతం పార్లమెంటరీ కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేశారు. పార్లమెంట్‌ ఆవరణ మొత్తాన్ని శానిటైజ్‌ చేశారు. ప్రవేశ ద్వారాల్లో సెనార్‌ డోర్లను అమర్చారు. భౌతికదూరం మార్గదర్శకాల ప్రకారం ఎంపిలు కూర్చునేందుకు ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, రెండు వేర్వేరు విడతల్లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారి చూడబోతున్నాం. సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజున రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమావేశం కానుంది. ప్రతి షిఫ్టులోనూ సభ్యులు కూర్చునేందుకు ఉభయసలభలతో పాటు వాటి గ్యాలరీలను కూడా ఉపయోగించుకుంటున్నారు. మాట్లాడే సభ్యులను చూపించేందుకు నాలుగు పెద్ద స్క్రీన్లను ఛాంబర్లలో పెట్టారు. మరో ఆరు చిన్న స్క్రీన్లు, ఆడియో సెట్లను నాలుగు గ్యాలరీల్లో ఉంచారు. పత్రాల వినియోగాన్ని కూడా పరిమితం చేశారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా బిల్లులు, ఆర్డినెన్సులు తదితర పేపర్లను పంపిణీ చేయనున్నారు. సభ్యులు సొంతంగా ఈ పరికరాలను తెచ్చుకునేందుకు కూడా అనుమతినిచ్చారు. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి 72 గంటల ముందు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. తరుచూ పార్లమెంట్‌ ఆవరణ మొత్తాన్ని శానిటైజ్‌ చేయడంతో పాటు వివిధ పార్లమెంటరీ పేపర్లను, పాదరక్షలు, ఎంపిల కార్లను కూడా శానిటైజ్‌ చేశాలే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మొత్తం పార్లమెంట్‌ భవనాన్ని సురక్షిత ప్రాంతంగా తయారు చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎంపిలు, ఉభయసభల సచివాలయాల సిబ్బంది, వార్తాలను సేకరించే మీడియా సిబ్బంది కూడా సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, ఎంపిలు, సిబ్బంది సహా 4 వేలమంది పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఎంపిలు, మంత్రులను మాత్రమే ప్రధాన భవనం లోపలికి అనుమతిస్తారు. ఇప్పటికే డిఆర్‌డిఒ ఎంపిలందరికీ బహుళ ప్రయోజన కొవిడ్‌ కిట్లను సమకూర్చింది. ప్రతికిట్‌లో 40 డిస్పోసబుల్‌ మాస్కులు, ఐదు ఎన్‌ 95 మాస్కులు, 50 మిల్లీలీటర్లు గల 20 శానిటైజర్‌ బాటిళ్లు, ఫేస్‌ షీల్డ్‌, 40 జతల గ్లౌజ్‌లు ఉన్నాయి.
అఖిలపక్ష భేటీ రద్దు
కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించాల్సిన అఖిలపక్ష భేటీ రద్దయింది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించటం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. సాధారణంగా సమావేశాలకు ముందు అన్ని పార్టీలతో సమావేశమై సభలో ప్రభుత్వ అజెండా, లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు

DO YOU LIKE THIS ARTICLE?