ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో దిగజారిన గౌతమ్ అదానీ
సంపదలో సుమారు 12.06 లక్షలకోట్లు ఆవిరి
న్యూఢిల్లీ : ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో తాజాగా 30వ స్థానానికి దిగజారిపోయారు. ఆయన సంపదలో సుమారు 12.06 లక్షలకోట్లు ఆవిరి అయిపోయాయి. ఆయన సంపద 80 బిలియన్ డాలర్ల మేరకు కుదించుకుపోయింది. ఓడరేవులు నుండి విమానాశ్రయాల వరకూ అనేక వ్యాపారాలు ఉన్న అదానీకి వంటనూనెలు, ఇతర ఆహార వస్తువులు, ఇంధన వనరులు, సిమెంట్, డేటా సెంటర్లు వంటి అనేక వ్యాపారాలు ఉన్నాయి. గతనెల 24న అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ సామ్రాజ్యంలో ఉన్న లొసుగులను వెల్లడించిన ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ నివేదిక ప్రకటించింది. దీంతో దేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్టాక్‌మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు నిలదీశాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళడంతో సామాన్య ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తామే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు సెబీ దర్యాప్తు కూడాకొనసాగుతున్నది. అదానీ గ్యాస్ 80.68 శాతం, అదానీ గ్యాస్ 70.6 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 74.21 శాతం మేరకు విలువ క్షీణించాయి. హిండెన్‌బర్గ్ నివేదికకు ముంగాఅదానీకి 120 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉండేవి. ఆయన ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానంలో ఉండేవారు. అదానీ ప్రత్యర్థి ముఖేశ్ అంబానీని గత ఏడాదిలో ఆయన దాటిపోయి ఆసియాలోనే మూడవ అతిపెద్ద సంపన్నుడుగా అవతరించారు. ప్రస్తుతం ఆయన ఆసియాలో పదోస్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ ట్రెజరీ కార్యదర్శి, హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు లారీ సుమ్మర్స్ ఇటీవల మాట్లాడుతూ, ఇటీవల అదానీ సంక్షోభాన్ని ఆమెరికాలో లో జరిగిన ఎన్రాన్ కంపెనీ అవినీతితో సరిపోల్చారు. భారతదేశం జి సదస్సుకు అధ్యక్షబాధ్యతలు వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన తరుణంలో దేశంలో నెలకున్న అదానీ ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుందా? అని యావత్ ప్రపంచం మనవైపే చూస్తున్నది. హిండెన్‌బర్గ్ నివేదికను వ్యతిరేకిస్తూ అదానీ గ్రూపు జనవరి27న 413 పేజీలతో ఒక కౌంటర్ విడుదల చేసింది. అయితే హిండెన్‌బర్గ్ నివేదికను ఆక్షేపిస్తూ తాము వేసిన 68 ప్రశ్నలకు అదానీ గ్రూపు సమాధాన చెప్పలేదని పేర్కొంది. గౌతమ్ అదానీ పెద్ద అన్నయ్య వినోద్ అదానీ పాత్రను కూడా హిండెన్‌బర్గ్ తప్పుపట్టింది. అయితే వినోద్ అదానీకి తమ గ్రూపులో ఎలాంటి మేనేజీరియల్ బాధ్యతలూ లేవని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది.
నెలరోజుల్లో 3 నుంచి 30కి
RELATED ARTICLES