HomeNewsBreaking Newsనూతన చట్టాల ఫలితాలు చివరి గుడిసెకు అందాలె

నూతన చట్టాల ఫలితాలు చివరి గుడిసెకు అందాలె

ప్రజాసంక్షేమమే కొత్త చట్టాల ఉద్దేశం
వాటి అమలుకు 24 గంటలు శ్రమించాలి
మేయర్లు, మున్సిపల్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో కెసిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంట లూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సిఎం కెసిఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్‌ లైన్‌లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్స్‌, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్వయంపాలనలో తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న విప్లవాత్మక పాల నాసంస్కరణల్లో భాగంగా అమలుపరుస్తున్న వినూత్న చట్టాలు పది కాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సిఎం పేర్కొన్నారు. వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదే అన్నారు. భూములను క్రమబద్ధ్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సిఎం కెసిఆర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను
రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలోపాటు, రాష్ట్రంలోని అన్ని మిగతా పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.  “తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్‌ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్‌ లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది” అని సిఎం కెసిఆర్‌ సమావేశంలో అన్నారు. “ గుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినపుడు పేదలకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ధరణి వెబ్‌ పోర్టల్‌ ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్‌ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పాస్‌ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌ లైన్‌లో నమోదు చేయడం జరుగుతుంది. ఒకనాడు స్లమ్‌ ఏరియాల్లోని గుడిసె నివాసాలు అభివృద్ధితో నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారు. చారిత్రిక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించ వలసిన బాధ్యత ఉన్నది. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌ లైన్‌ లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్‌ డేట్‌ చేయాలి.” అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. కాగా, ఈ సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంఎల్‌ఎలు, మేయర్లతో సిఎం మాట్లాడించారు. వారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాస స్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతి సమస్యనూ అధికారులతో నోట్‌ చేయించారు. ఈ సమస్యల తక్షణమే పరిష్కారం కోసం విధి విధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, నగరాలు పట్టణ పరిధుల్లోని మంత్రులు మహమూద్‌ అలీ, పి.సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సిహెచ్‌.మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు, అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఆ పార్టీ ఎంఎల్‌ఎలు బలాల, కౌసర్‌ మొహినొద్దీన్‌, పాషా ఖాద్రీ, సిఎంఓ అధికారులు, నగర, పట్టణాల పరిధిలోని ఎంఎల్‌ఎలతో పాటు అన్ని కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments