నూతన అధ్యాయం!

భారత్‌, చైనాల మధ్య కొత్త శకాన్ని ఆరంభించిన ‘చెన్నై కనెక్ట్‌’
మోడీ, జిన్‌పింగ్‌ సుదీర్ఘ సమాలోచనలు
వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త యంత్రాంగం
విశ్వాస పునరుద్దరణ చర్యలకు ఊతం
ఎలాంటి ప్రస్తావనకు రాని కశ్మీర్‌ సమస్య
చెన్నై : విభేదాలను పక్కనబెట్టి ఇరు దేశాల మధ్య సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని భారత్‌, చైనాలు తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య శనివారంనాడు జరిగిన భేటీ ఇరు దేశాల సంబంధాల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. మోడీ, జిన్‌పింగ్‌లు పలు కీలక అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. జిన్‌పింగ్‌ వ్యూహాత్మక భారత పర్యటన సఫలీకృతమైందని చైనా అధికారులు ప్రకటించారు. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరుదేశాల మధ్య విశ్వాస పునరుద్దరణ చర్యలు తదితర అంశాలపై నేతలు చర్చించారు. పురాతన కట్టడాలకు నెలవైన మహాబలిపురంలోని మామళ్లపురంలో జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడు గంటల సమయం పాటు మోడీతో చర్చలు జరిపారు. భారత్‌, చైనాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల అవకాశాలను పెంచే అం శంపై ఉన్నతస్థాయిలో కొత్తగా ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. అలాగే ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కోసం చైనా నిర్వహిస్తున్న చర్చల పట్ల భారత్‌ ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని జిన్‌పింగ్‌ ఈ సందర్భంగా హామీయిచ్చారు. భద్రతాపరమైన సహకారం ఎల్లప్పుడూ వుంటుందని తెలిపారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు, ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా విశ్వాస పునరుద్దరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వారం క్రితమే బీజింగ్‌లో పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన పర్యటన గురించి మోడీతో జిన్‌పింగ్‌ సమీక్షించడం విశేషం. ఈ కొత్త బాంధవ్యాన్ని ‘చెన్నై కనెక్ట్‌’గా ఇరువురు నేతలు అభివర్ణించారు. అలాగే 90 నిమిషాలపాటు ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. కాగా, మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ నేపథ్యంలో కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోడీ-జిన్‌పింగ్‌ అనధికార శిఖరాగ్ర భేటీ లో కశ్మీర్‌ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?