కృష్ణా జలాల వాటా కుంచించుకుపోయే ప్రమాదం
స్పీడెక్కిన ఆంధ్రా, కర్నాటక
తెలంగాణ ప్రభుత్వం మౌనం
ప్రజాపక్షం/హైదరాబాద్
తెలంగాణకు వచ్చే కృష్ణా నదీ జలాల వాటా వాస్తవ రూపంలో మరింత కుంచించుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఒకవైపు కర్ణాటక, మరోవైపు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి వచ్చే కృష్ణా నీటిని వారి వద్దే ఒడిసి పట్టేందుకు చక చకా ప్రణాళికలు వేస్తున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రాష్ట్రాల చర్యలపై మౌనం వహిస్తోంది. దీంతో దక్షిణ తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు తగ్గి, ఎస్‌ఎల్‌బిసి, పాలమూరు కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు ఎసరు వచ్చే ప్రమాదమున్నదని ప్రతిపక్ష పార్టీల నేతలు, సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రాయలసీమకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసి, టెండర్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నాటక రాష్ట్రం కూడా ఎగువన ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు అనుమతుల కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో తెలంగాణకు వచ్చే కృష్ణా జలాలు ప్రమాదంలో పడ్డాయి.
కృష్ణానది కర్నాటకలో పుట్టి, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి, చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో అడుగుపెట్టేముందు కృష్ణానదిపై ఆల్మట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి నిండిన తరువాత మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వైపు మళ్లి, అక్కడ ప్రాజెక్టు నుండి తెలంగాణలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పరుగులిడుతుంది. సాగర్‌లో నీటిని విడుదల చేస్తే, కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు, దిగువన పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా జలాలు ఎపిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు పారుతాయి.
కర్నాటక ‘ఎత్తు’లు ఇలా: ఎగువన ఆల్మట్టి డ్యామ్ పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం పావులు కదుపుతున్నది. వాస్తవానికి కర్నాటకకు చెందిన దేవేగౌడ ప్రధానిగా ఉండగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా ప్రాజెక్టులు, కృష్ణా డెల్టా ప్రమాదంలో పడుతుందని ఉద్యమాలు జరగడంతో ఎత్తును తగ్గించి కట్టారు. ఇటీవల ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుండి 524 మీటర్లకు పెంచేందుకు వీలుగా నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి రమేశ్ జరికిహోళి ఈ నెలారంభంలో వెల్లడించారు. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. అటు కేంద్రం, ఇటు కర్నాటక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలే ఉండడం వారికి కలిసొచ్చే అంశంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. డ్యామ్ ఎత్తు పెంచితే ఆలమట్టిలో అదనంగా వందకు పైగా టిఎంసిలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఆలా జరిగితే దిగువన తెలంగాణలో కృష్ణా నది ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
రాయలసీమకు మళ్ళిస్తున్న ఎపి: కృష్ణా జలాలను మరింతగా తమవైపునకు మళ్ళించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల నుండి 44వేలకు పెంచేందుకు, సంగమేశ్వరం నుండి మూడు టిఎంసిలు తరలించేందుకు ఎత్తిపోతల పథకానికి పచ్చజెండా ఊపుతూ మే నెల 5వతేదీన ఎపి ప్రభుత్వం జిఒ 203 జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, టెండర్‌లపై స్టే ఇచ్చింది. ఇటీవల ఆ స్టేను ఎత్తివేయడంతో ఎపి ప్రభుత్వం మరోసారి టెండర్‌ల దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.
తెలంగాణ సర్కార్ సైలెంట్: గతంలో విపక్షాలన్నీ విమర్శించడంతో ఎపి జిఒ జారీ చేసిన వారం తరువాత సిఎం కెసిఆర్ స్పందించి, సమయం వచ్చినప్పుడు తగు చర్యలు తీసుకుంటామన్నారు.
తరువాత కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఇరు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. తాజాగా ఇదే నెలలో అటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాలను మరిన్ని ఒడిసిపట్టుకునేందుకు వేగంగా సాగుతున్నట్లు సంకేతాలిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి బహిరంగ స్పందన కనిపించలేదు. ఇటీవల సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్వహించిన సమీక్షా సమావేశాల సందర్భంగా కూడా ఈ అంశాలపై ఎలాంటి ప్రకటన విడుదలకాలేదు.
నీళ్లు పోతయ్!
RELATED ARTICLES