నిరాడంబరంగాలష్కర్‌ బోనాల పండుగ

చరిత్రలోనే మొదటిసారి భక్తులు లేకుండానే..
ఆలయానికి దారితీసే దారులు మూసేసిన పోలీసులు
తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సతీమణి
జన సంచారం లేని లష్కర్‌ రహదారులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ (లష్కర్‌) ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగ ఆదివారం నిరాడంబరంగా జరిగింది. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్‌ బోనాల పండుగ రోజు రహదారులన్నీ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడేవి. లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చేవారు. కానీ చరిత్రలోనే మొదటిసారిగా భక్తులు లేకుండానే అమ్మవారికి బోనాలు సమర్పించారు. 425 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగరంలో బోనాల పండుగ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. భక్తుల కోలాహలం, ఫలహారం, బండ్ల ఊరేగింపులతో, శివ సత్తుల శిగాలు, పోతరాజుల వీరంగాలతో ఆనందోత్సాహాల మధ్య పండుగను నగరవాసులు నిర్వహించుకునేవారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఎవరూ బోనాలు తీసుకొని రావద్దని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేవాలయానికి చేరుకునే రహదారులన్నింటినీ పోలీసులు మూసేశారు. దేవాలయం పరిసరాల్లో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. కరోనా ప్రభావంతో భక్తులు ఇంట్లోనే బోనాలు సమర్పించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితుల సమక్షంలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సతీమణి స్వర్ణ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. మంత్రి కుటుంబసభ్యులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. మంత్రి భార్య స్వర్ణ ఆలయం బయటే పండితులకు బోనాన్ని అందజేశారు. భక్తులెవరూ లేకుండానే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించామని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఇలా భక్తులు లేకుండా బోనాలు సమర్పించడం చరిత్రలోనే తొలిసారన్నారు. భక్తులు లేకపోయినా, ఆచార సంప్రదాయలను ఖచ్చితంగా పాటిస్తూ బోనాల వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజల పక్షాన అమ్మవారిని తాను కోరానని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ శాఖల సమన్యయంతో బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లాల్‌ దర్వాజా బోనాలను కూడా ఇదే తరహాలో నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు బోనాలను ఇళ్ల వద్దనే చేసుకుంటున్నారన్నారు. ప్రజలు ఇళ్ల వద్దనే బోనాల పండుగ నిర్వహించుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?