లైంగిక వేధింపుల సమస్యను కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎప్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గత ఏడాది ఆందోళనకు దిగిన భారత అంతర్జాతీ మహిళా రెజ్లర్లు మరోసారి నిరసన దీక్ష చేపట్టారు. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగత్, ఈ ఆరోపణలపై కేంద్రం నియమించిన విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటి వరకూ బహిర్గతం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై గత ఏడాది ఏడుగురు మహిళా రెజ్లర్లు కనాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఆరోపణలు దుమారం రేపడంతో, ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో కేంద్రం ఈ ఏడాది జనవరి23న ఒక ప్యానెల్‌ను నియమించింది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం గడువును మరో రెండు వారాలు పొడిగించింది. ఈనెల మొదటి వారంలో ప్యానెల్ తన నివేదికను సమర్పించగా, ఇప్పటి వరకూ దానిని ఎందుకు రహస్యంగా ఉంటారని, జంతర్‌మంత్ వద్ద మరికొంత మంది రెజ్లర్లతో కలిసి దీక్షను ప్రారంభించిన సాక్షి మాలిక్ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉన్న కారణంగా తాము కోర్టును ఆశ్రయించలేదని, కానీ, ఇప్పటి వరకూ నివేదికను బయటపెట్టకపోవడం, ఎఫ్‌ఐఆర్ కూడా రిజిస్టర్ కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని చెప్పింది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకూ తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బబితా ఫొగత్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. బబిత బిజెపి సభ్యురాలని, హర్యానా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నదని సాక్షి మాలిక్ గుర్తుచేసింది.వినేష్ ఫొగత్ మాట్లాడుతూ, ఇంతటి ప్రధాన సమస్యను కూడా కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు కాకపోవడంలో అర్థం ఏమిటని ఆమె ప్రశ్నించింది. ఇలావుంటే ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్‌మంతర్ వద్ద దీక్షలో ప్రముఖ రెజ్లర్లు బజరంగ్ పునియా, రవి దహియా, దీపక్ పునియా తదితరులు కూడా పాల్గొన్నారు.
నిరసన ‘రింగ్’లోకిమహిళా రెజ్లర్లు
RELATED ARTICLES