నిరసన భగ్నం

ప్రతిపక్ష నేతల అరెస్టు
సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన
గన్‌పార్క్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి నిరసన తెలిపేందుకే ప్రయత్నించిన ప్రతిపక్షాల పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సోమవారం ఉదయమే పోలీసులు శానసభ ఎదుట గన్‌పార్క్‌ వద్ద భారీగా మోహరించా రు. ఉదయం 11 గంటలకల్లా విడివిడిగా వచ్చిన నాయకులను అమరవీరుల స్థూపం వరకు కూడా వెళ్ళనీయలేదు. కారు దిగీదిగగానే వెన్వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణలను పోలీసులు అరెస్టు చేశారు. టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత కె.గోవర్దన్‌లను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చివరగా వచ్చిన ఎఐసిసి కార్యదర్శి ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ను కూడా కారు దిగగానే అరెస్టు చేశారు. అదే విధంగా సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని ముషీరాబాద్‌, మరికొందరు నాయకులను నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో నాయకులకు వాగ్వాదం జరిగింది. కనీసం

గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి కూడా నివాళులర్పించనీయకపోవడమేమిటని మండిపడ్డారు. అరెస్టుకు ముందు నాయకులు మీడియాతో మాట్లాడారు.
ప్రజాధనం దుర్వినియోగం : చాడ వెంకట్‌రెడ్డి
సచివాలయాన్ని కూల్చివేయొద్దని ఎన్నిసార్లు అఖిలపక్షంగా ప్రభుత్వానికి చెప్పినా వినడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. చివరకు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే సచివాలయాన్ని కూల్చేశారని విమర్శించారు. కొత్త సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కనీసం అమరవీరులకు కూడా నివాళులు అర్పించనీయకపోవడం దారుణమన్నారు.
ప్రజలు వ్యతిరేకిస్తున్నారు: సంపత్‌కుమార్‌
ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అయితే కనీసం నిరసనకు కూడా తావివ్వకపోవడం అన్యాయమన్నారు.
ప్రగతిభవన్‌, సచివాలయంలో కొవిడ్‌ ఆసుపత్రి పెట్టాలి : రమణ
దేశంలో ముంబయి తరువాత హైదరాబాద్‌లోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని టిడిపి రాష్ట అధ్యక్షులు ఎల్‌.రమణ విమర్శించారు. ముంబయిలోని ప్రపంచంలోనే అతి పెద్దదైన ధారావి మురికివాడలో కరోనాను కట్టడి చేశారని, తెలంగాణలో చేయలేకపోవటం మన రాష్ట్ర ప్రభుత్వ చేతికానితనమేనన్నారు. సచివాలయ కూల్చివేతపై అఖిలపక్ష సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవటం అన్యాయమన్నారు. కరోనా కష్ట కాలంలో ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కే పరిమితమమయ్యారని చెప్పారు. ప్రగతిభవన్‌, సచివాయంలో తక్షణమే కొవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రతిపక్షాలంటే చిన్నచూపు : గోవర్దన్‌
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రతిపక్షాలంటే చిన్నచూపు అని సిపిఐ(ఎంఎల్‌ – ఎన్‌డి) రాష్ట్ర నాయకులు కె.గోవర్దన్‌ అన్నారు. కనీసం నిరసన తెలపనీయకపోవడం, ఎందరి త్యాగాల ఫలితంగానో వచ్చిన తెలంగాణలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించనీయకపోవడమేమిటని ప్రశ్నించారు.

సచివాలయం కూల్చివేతపై
క్యాబినెట్‌ తీర్మానం కాపీ ఇవ్వండి !
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
జులై 15 వరకు స్టే పొడిగింపు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
సచివాయల భవనాలను కూల్చేసేందుకు రా్రష్ట్ర మంత్రివర్గం జూన్‌ 30 తీర్మానం చేసిందని చెబుతున్న ప్రభుత్వం.. ఆ మేరకు తీర్మాన ప్రతిని సీల్‌ కవర్‌లో అందజేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో కోర్టు లో జోక్యం చేసుకోరాదనే వాదనను తోసిపుచ్చింది. గతంలో క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఇదే హైకోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. సెక్రటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చి కొత్తగా కట్టాలని జూన్‌ 30న క్యాబినెట్‌ ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఎందుకు రహస్యంగా ఉందని ప్రశ్నించింది. పత్రికల్లో వార్తలు కూడా రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటించలేదని, అందుకే క్యాబినెట్‌ నిర్ణయ ప్రతిని సీల్‌ కవర్‌లో అందజేయాలని కోరుతున్నామని స్పష్టం చేసింది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం ఏ అనుమతులు లేకుండానే సెక్రటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ జనసమితి పార్టీ నేత ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వర్‌రావు, ఇంటిపార్టీ నేత డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం విచారించింది. సెక్రటేరియట్‌ బిల్డింగ్స్‌ కూల్చేయడానికి క్యాబినెట్‌ తుది నిర్ణయం తీసుకుందా అని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించగా, అది విధాన నిర్ణయం అవుతుందని, కోర్టులు జోక్యం చేసుకోరాదని, అయినా పిల్స్‌ రాజకీయంగా వేశారని ఎజి బిఎస్‌ ప్రసాద్‌ జవాబు చెప్పారు. కూల్చివేత పనులు మధ్యలో ఆగాయని, దీని వల్ల ప్రమాదం ఏర్పడవచ్చునని, పూర్తిగా కూల్చేందుకు అనుమతి ఇవ్వాలని ఎజి కోరారు. క్యాబినెట్‌ నిర్ణయ ప్రతిని సోమవారమే ఆందజేస్తామన్నారు. విచారణ మంగళవారానిక వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించని హైకోర్టు విచారణను 15కి వాయిదా వేసింది. అంతుకు ముందు పిటిషనర్‌ లాయర్‌ ప్రభాకర్‌ వాదిస్తూ, కూల్చివేతకు పొల్యూషన్‌, ఎన్విరాన్‌మెంట్స్‌ యాక్ట్‌ కింద అనుమతి తీసుకోలేదన్నారు. అనుమతులు తీసుకున్నదీ, లేనిదీ ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కౌంటర్‌ వేయాలని ఆదేశించాలన్నారు. కేంద్రం 2016లో నిర్మాణాలు పదార్థాల నిర్వహణకు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయలేదని, అందులోని 4(3) రూల్‌ను అమలు చేయలేదన్నారు. విచారణను 15కి వాయిదా వేసింది. సచివాలయ భవనాల్ని కూల్చేయాలని, కొత్తగా నిర్మాణాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం జూన్‌ 30న తీర్మానం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత తీర్మానానికి అనుగుణంగానే తాజా తీర్మానం చేశాం.. బిల్డింగ్స్‌ కూల్చేయాలని జులై 4న ఆర్‌అండ్‌బి అనుమతి ఇచ్చింది. ఇఎన్‌సి రిపోర్టు మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్‌ కూడా కూల్చేందుకు అనుమతి ఇచ్చారు. రాజకీయ పార్టీలకు చెందిన పిటిషనర్లు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనే హైకోర్టుకు వచ్చారు. పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్స్‌ పొలిటికల్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్స్‌గా మారకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. 2016లో, కేంద్రం జారీ చేసిన నిబంధనల్లోని 4(3)ను ఉల్లంఘించలేదు. కూల్చుడు వల్ల కాలుష్య వ్యాప్తి అవుతోందనేది నిజం కాదు. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున కూల్చరాదని, కొత్తగా నిర్మాణాలు చేయరాదనేదీ అవాస్తవం. 25.5 ఎకరాల్లో కొత్తగా సెక్రటేరియట్‌ కట్టేందుకు వీలుగా పిల్స్‌ను డిస్మిస్‌ చేయాలి.. అని సిఎస్‌ కౌంటర్లో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?