నవశకం

నేటి నుంచి ఈడెన్‌లో తొలి డై/నైట్‌ టెస్టు
గెలుపే లక్ష్యంగా భారత్‌
పరువు కోసం బంగ్లా
జోరుమీదున్న భారత బౌలింగ్‌ దళం
కోల్‌కతా : భారత క్రికెట్‌ చరిత్రలో నవశకానికి తొలి అడుగు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌లో జరిగే డే/నైట్‌ టెస్టు. ఈ మ్యాచ్‌ అకోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఎదరుచూస్తోంది. కాగా, సంధ్య వెలుగు – ప్రకృతి తన రక్షణను మార్చుకునే సందర్భంలో విరామం ఇచ్చే సమయం. తెలుగులో అర్ధమయ్యేలా చెప్పాలంటే సూర్యుడు అస్తమించే సమయంలో ప్రసరించే వెలుగు. ఈ సమయంలో ఉండే కొద్దిపాటి వెలుగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌- జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్‌ టెస్టు మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. ప్లడ్‌ లైట్ల వెలుగులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పింక్‌ బాల్‌ను వాడనున్నారు. దీంతో పింక్‌ బాల్‌ ఏ సమయంలో ఎలా స్పందిస్తుందో.. దానిపై ఎలా నియంత్రణ సాధించాలనే ఆందోళన ఇరు జట్ల ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ పింక్‌ బాల్‌తో ఆడిన, చూసిన వాళ్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అవగాహన ఉన్నవాళ్లు ఒకే ఒక మాట చెబుతున్నారు. అదేంటంటే ప్రతి రోజూ ఆటలో సూర్యుడి అస్తమించే సమయంలో రెండు గంటల సమయం అత్యంత కీలకమవుతుందని అంటున్నారు. కాగా, తొలిటెస్టులో గెలియిన టీమిండియా ఈ టెస్టులనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే యోచనలో ఉండగా., బంగ్లా మాత్రం ఎలాగైనా గెలిచి సమం చేయాలనే యోచనలో కనిపిస్తోంది. అయితే భారత బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉండటం, బంగ్లాకు ఇదే తొలిసారి పింక్‌బాల్‌ టెస్టు ఆడటం టీమిండియా బాగా కలిసొచ్చే అంశం. అంతేకాదు భారత బ్యాటింగ్‌ లైనప్‌ కూడా భీకర ఫాంలో ఉంది. దీంతో ఈ టెస్టులోనూ భారత్‌ విజయం లాంఛనమే.
మధ్యహ్నం 1 గంటల నుంచి..
మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్‌ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పింక్‌ బాల్‌ అత్యంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ సమయంలో పేస్‌ బౌలర్లు చెలరేగే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాచ్‌ ఆరంభంలో కొత్త బంతి ఇబ్బంది పెట్టినప్పటికీ క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు రాబట్టొచ్చు. అయితే, వెలుతురు తగ్గిపోయే కొద్దీ అంటే సూర్యాస్త సమయంలో బంతిని గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు ఓ సవాల్‌ అని చెబుతున్నారు. ఆ సమయంలో రెండో సెషన్‌ నడుస్తుంటుంది కాబట్టి అప్పటికీ బంతి మరీ పాతబడదు. మిగతా సమయాలతో పోలిస్తే ఎక్కువ స్వింగ్‌, వేగంతో పింక్‌ బాల్‌ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే పింక్‌ బాల్‌ టెస్టులో రెండో సెషన్‌ ఎంతో కీలకమని అంటున్నారు. ఇక, ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.
సాహాకు అనుభవం..
ఇదిలా ఉంటే, పింక్‌ బంతితో ఆడిన అనుభవం ఉన్న కొద్దిమందిలో భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఒకడు. అయితే, సాహాకు కూకబుర్రా బంతితో ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సాహా మాట్లాడుతూ ‘మేము మూడేళ్ల క్రితం ఆడినప్పుడు అది కూకబుర్రా బంతి. కానీ ఇప్పుడు ఎస్జీ బంతి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంచెం స్వింగ్‌ ఉండొచ్చు. కానీ, సవాల్‌ ఎదుర్కొనేది మాత్రం సంధ్య వెలుగులోనే‘ అని అన్నాడు. ‘ఇది పేసర్లకు ప్రయోజనకరమే. బ్యాట్స్‌మెన్‌కు కష్టం. ఇక తెలుపు బంతి క్రికెట్లో సైట్‌ స్క్రీన్‌ నలుపు రంగులో ఉంటుంది. బంతి పాతబడ్డా ఇబ్బంది ఉండుదు. పింక్‌ టెస్టులో అలా కాదు. బ్యాక్‌డ్రాప్‌ స్పష్టంగా ఉండదు. ఇది వికెట్‌ కీపర్‌కూ సవాల్‌గానే ఉంటుంది. నేను స్లిప్‌ ఫీల్డర్ల సమీపంలో నిల్చుంటాను. మా పేసర్లు కొన్నిసార్లు బాగా స్వింగ్‌ చేస్తారు. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి‘ అని అన్నాడు.
షమీ బౌలింగ్‌లో కోహ్లీ..
పింక్‌ బాల్‌ టెస్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిిండయా వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగా పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు 48 గంటలు ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంధ్యా సమయంలో సెట్స్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ప్రాక్సీట్‌ చేశాడు. అదే సమయంలో ప్ల్‌డ లైట్లు వెలిగి ఉండటం విశేషం. ఆ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రహానే కాపేపు ప్రాక్టీస్‌ చేశాడు. అనంతరం రవిశాస్త్రి పర్యవేక్షణలో అశ్విన్‌, జడేజా బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేశాడు. కాగా, టీమిండియా పేసర్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన సమయంలో పిచ్‌ ఆకుపచ్చ రంగుని కలిగి ఉంది. మొత్తంగా పింక్‌ బాల్‌ టెస్టులో భారత పేసర్లు సత్తా చాటే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్లు 14 వికెట్లు తీయగా అందులో షమి 7 వికెట్లతో చెలరేగాడు. ఇక, కోల్‌కతా షమీ సొంత మైదానం కావడంతో అతడిపై జట్టు మేనేజ్‌మెంట్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
బ్రాడ్‌మన్‌ను దాటేనా?
యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌ ఇప్పటివరకు 8 టెస్టులాడి 71.50 యావరేజితో 858 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అయితే, మూడు సెంచరీల్లో రెండింటిని డబుల్‌ సెంచరీలుగా మలిచాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు మయాంక్‌ అగర్వాల్‌ ఓ అద్భుతమైన రికార్డుపై కన్నేశాడు. టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించడానికి మయాంక్‌ అగర్వాల్‌ ప్రస్తుతం 142 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే శుక్రవారం నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ గనుక ఈ పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్‌ సర్‌ బ్రాడ్‌మన్‌ రికార్డుని సమం చేస్తాడు. సర్‌ బ్రాడ్‌మన్‌ కూడా టెస్టుల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించగా, ఇప్పుడు మయాంక్‌ను కూడా అదే రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా(ఇన్నింగ్స్‌లు పరంగా) వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సట్‌క్లిఫీ(ఇంగ్లండ్‌), ఈడీ వీకెస్‌(వెస్టిండీస్‌) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా 12వ ఇన్నింగ్స్‌ల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నారు. ఆ తర్వాత స్థానంలో బ్రాడ్‌మన్‌ ఉన్నాడు.
మైలురాయికి 32 పరుగులే
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డుకి చేరువయ్యాడు. ఈ పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. భారత్‌ తరుఫున ఐదువేల పరుగు మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లీ గనుక మరో 32 పరుగులు చేస్తే ఈ ఘనత సాధిస్తాడు. భారత్‌ తరుపున ఇప్పటి వరకు 83 టెస్టులు ఆడిన కోహ్లీ 7,066 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 32 పరుగులు దూరంలో ఉన్నాడు. భారత్‌ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరతాడు. అంతేకాదు భారత్‌ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా నిలుస్తాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(8,659) అగ్రస్థానంలో ఉండగా అలెన్‌ బోర్డర్‌(6,623), రికీ పాంటింగ్‌(6,542), క్లైవ్‌ లాయిడ్‌(5,233), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(5,156)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?