బడ్జెట్ సమావేశంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బడ్జెట్ సమావేశాన్ని గురువారం ఆరంభిస్తూ పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి గంటసేపు ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్ ‘అనిశ్చితి’ ఎదుర్కొందని, అప్పుడు మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని, ప్రజల ఆశలు చిగురింపజేస్తూ ‘నవ భారత్’ కోసం పనిచేయడం మొదలెట్టిందన్నారు. అన్ని వర్గాల అభిలాషల మేరకే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముస్లిం మహిళలు నిర్భయంగా జీవించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌ను ఆమోదింపజేసే యత్నం చేసిందన్నారు. వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వం 21 కోట్ల మందిని జీవిత బీమా పథకం కిందికి తెచ్చిందన్నారు. కాగా ప్రధాని సౌభాగ్య స్కీము కింద 2కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యానికి 2019 కీలక సంవత్సరమని అభివర్ణించారు. దేశం మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాన్ని జరుపుకుందన్నారు. పట్టణాలైనా, గ్రామాలైనా ప్రభుత్వం ఆరోగ్య మౌలికవసతులను బలోపేతం చేసిందన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి కూడా ప్రస్తావించారు.
దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలతో సరిహద్దులు సురక్షితమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమంటూ భారత సైనిక పాటవాన్ని ప్రశంసించారు.