10,019 ఎకరాల భూములను దోచుకున్నట్లు తేల్చిన సిట్
ప్రభుత్వానికి నివేదిక
ప్రజాపక్షం/హైదరాబాద్: మాజీ నక్సలైట్, మాఫియా ముఠా నాయకుడు నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం అక్రమాస్తులపై సిట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బెదిరింపులు, హత్యలకు పాల్పడి నయీ మ్ రూ.2000 కోట్ల విలువైన 10,019 ఎకరాల భూములను దోచుకున్నాడని సిట్ దర్యాప్తులో తేలింది. అలాగే అతనికి రాష్ట్రంలో 29 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్ని బినామీ పేర్లతో ఉన్నాయి. ఆగస్టు 8, 2016న నయీమ్ షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ వెంటనే నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని పుప్పాల్‌గూడలోని అలకాపురిలో అతని ఇంటిపై పోలీసులు దాడి చేసి రూ.2 కోట్ల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని భార్యతో పాటు 11 మంది అనుచరులను అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇంట్లో జరిపిన సోదాల్లో 360కి పైగా భూముల కు చెందిన డాక్యుమెంట్లు సైతం లభ్యమయ్యాయి. ఈ డాక్యుమెంట్లను పరిశీలించేందుకు సిట్ అధికారులు వాటిని వివిధ ప్రాంతాల పోలీసు అధికారులకు పంపారు. ఆ భూములు నిజానికి ఎవరివి..? డాక్యుమెంట్‌లో పేర్కొన్న బినామీలు ఎవరు..? ఆ భూముల విలువ ఎంత..? ఈ భూములు బలవంతంగా లాక్కునవా..? బాధితుల వివరాలు తెలుసుకుని సిట్ అధికారులకు అందించాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల ఎస్‌పిలకు విచారణ నిమిత్తం డాక్యుమెంట్లను అందించారు. నయీమ్ ఎన్‌కౌంటర్ అయిన తరువాత అతని చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ వెంటనే మూడు నెలల వ్యవధిలోనే సుమారు 500లకు పైగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి వీటిలో 175 కేసులను నమోదు చేసిన పోలీసులు 80 మంది నయీమ్ అనుచరులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరిపై పిడి యాక్ట్ కూడా విధించారు. ఇక ఆయా జిల్లాల పోలీసు అధికారులు నయీమ్ భూ దందాపై విచారణ చేపట్టారు. నిజమైన బాధితులు ఎవరనె విషయంపై ఆరా తీశారు. ఆ భూములు నయీమ్ ఎలా బెదిరించి తీసుకున్నాడనే అంశాలపై కూడా కూలంకశంగా వివరాలు సేకరించారు.ఆ భూముల వివరాలు, దాని విలువను సైతం సేకరించి సిట్ అధికారులకు అందించారు. ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నయీమ్ బినామి ఆస్తులపై సిట్ అధికారులు లెక్కిచగా నయీమ్ తన పదేళ్ల కాలంలో రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలలో రూ.2000 కోట్ల విలువైన 10019 ఎకరాలను దోచుకున్నట్లు నిర్ధారించారు. అలాగే నయీమ్‌కు అత్యంత విలువైన 29 భవనాలు కూడా బినామి పేర్లపై ఉన్నాయని తేల్చారు. ఈ మేరకు నయీమ్ దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలపై సిట్ అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటికే నయీమ్ బినామి ఆస్తులపై హైదరాబాద్ ఐటి శాఖ ఢిల్లీలోని ఇన్‌కం ట్యాక్స్ ఆడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ అధికారులు కూడా ఈ ఆస్తులను సీజ్ చేసేందుకు ఇడి, ఐటి విభాగాలకు కూడా లేఖలు రాసింది. బినామీలకు ఐటి అధికారులు నోటీసులు జారీ చేసి విచారించాయి. ఇంత విలువైన భూములు ఎలా ఖరీదు చేశారు, మీ డబ్బు సంపాదన ఎంత, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అరా తీశారు.