కృష్ణానది జలాల్లో మొత్తం వాటా తేలేదాకా విశ్రమించేది లేదు
ప్రజల హక్కులు గాలికి వదిలేసి దుర్భాషలాడితే పెద్ద వాళ్ళు అవుతారా?
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
ప్రజాపక్షం/నల్లగొండ ప్రతినిధి‘నదుల మీద, నీటి మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు. అసెంబ్లీ తీర్మానంతో సమస్య అయిపోదు. కృష్ణా నది జలాల్లో మొత్తం నీటి వాటాలు తేలేదాకా విశ్రమించేది లేదు. న్యాయమైన ప్రజల హక్కులు, వాటాల కోసం మరో పోరాటం చేయాలి. చావు నోట్లోకి పోయి తెలంగాణ తీసుకు వచ్చిన నాకు ఈ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటం ఉంటుంది’ అని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తన కట్టే కాలేవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చాతనైనా కాకపోయినా పులిలాగా లేచి కొట్లాడుతానని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ బహిరంగ సభ’లో కెసిఆర్ ప్రసంగించారు. కృష్ణా ట్రిబ్యునల్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపైన కూడా కొట్లాడాలని, ఇదే మాట చెప్పేందుకు ఇంత దూరం నల్లగొండకు
వచ్చానన్నారు. ఛలో నల్లగొండ పేరుతో పెట్టిన సభ రాజకీయ సభ కాదని ఉద్యమ సభ అని అన్నారు. ‘కృష్ణానది జలాలు లేక నలగొండ జిల్లా బిడ్డల నడుములు ఫ్లోరైడ్ తో వంగిపోయాయని, ఆరోజు ఉన్న పార్టీలు నాయకులు ఏనాడు పట్టించుకోలేదన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నల్లగొండ జిల్లాలో ప్లోరోసిస్‌తో బాధ లేకుండా చేసిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు వచ్చాక ఫ్లోరైడ్ బాధలు పోయాయన్నారు. నల్లగొండలో సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేకుండా తమకు వ్యతిరేకం అనుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందేలా చూడాలి కానీ కేవలం కెసిఆర్‌ను పనిగా పెట్టుకుని తిడుతూ లేని పోనీ బదనాం చేసి ప్రజల హక్కులను గాలికి వదిలేసి దుర్భాషలాడితే పెద్ద వాళ్ళు అవుతారా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎవరికి అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతమని, తెలంగాణ ప్రజల వాటాలు శాశ్వతమని, తెలంగాణ బతుకులు శాశ్వతమని, తెలంగాణను కొట్లాడి తెచ్చినం కాబట్టి వీటన్నింటి కోసం కొట్లాడుతూనే ఉంటామని కెసిఆర్ చెప్పారు. నల్లగొండ సభ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కావాలన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో పదేళ్లు పరిపాలన చేసి ఒక్క నిమిషం పోకుండా కరెంటు, ఇంటింటికి నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఆనాడు జలసాధన ఉద్యమం కోసం 45 రోజులపాటు ప్రజల్లో తిరిగి చైతన్యం చేశామని, ఆనాడు పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితం ఏమి లేకపాయే అని పాట రాసి ఏడ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత డిండి ఎత్తిపోతల పథకం పూర్తి దశకు వచ్చిందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తికానున్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు వేసినా కేంద్రంతో కొట్లాడుతూ ఈ ప్రాజెక్టులన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేశామని, ఢిల్లీలోని మోడీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా, నీళ్ల పంపిణీ చేయమని కోరినా ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేశామని, దీంతో మోడీ ప్రభుత్వం కేసు వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పడంతో వెనక్కి తీసుకున్నామని, వారం రోజులపాటు లోక్‌సభను స్తంభింప చేసి కొట్లాడామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం కెఆర్‌ఎంబి బోర్డుకు కృష్ణా జలాలను అప్పజెప్పిందని కెసిఆర్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉందని చెప్పడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ కోసం కోట్ల మంది ఎందుకు ఉద్యమం చేశారో, ఇదే జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మత్యాగం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై హరీష్‌రావు అసెంబ్లీలో గర్జిస్తే బిఆర్‌ఎస్ ఒత్తిడితో ఆగమేఘాల మీద చలో నల్లగొండ సభ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. కరెంటు సమస్య రాకుండా దామరచర్లలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు చేస్తే నాలుగు వేల మెగావాట్ల కరెంటు వస్తుందని, గతంలో కన్నా 5600 మెగావాట్ల విద్యుత్ ఎక్కువగా ఉన్నప్పటికీ కరెంటు ఎందుకు ఇవ్వడంలేదని, ప్రజలను ఎందుకు తిప్పలు పెడుతున్నారని ప్రభుత్వాన్ని కెసిఆర్ నిలదీశారు. రైతుబంధు ఇవ్వడానికి కూడా చేతనవ్వడం లేదని, ఇంత దద్దమ్మలని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ రైతులను పట్టుకుని చెప్పుతో కొట్టాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ తీవ్రంగా ఖండించారు. పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయనే విషయాన్ని మరిచిపోవద్దంటూ రైతులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయాలని, రాష్ట్రంలో గురుకులాల సంఖ్య పెంచాలని, కానీ ఇవన్నీ పట్టించుకోకుండా బలాదూర్‌గా తిరిగితే నిలదీస్తామని కెసిఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ పోతాం.. బొందల గడ్డ పోవడం కాదు దమ్ముంటే ప్రాణహితలో ఉన్న నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. మేము కూడా అసెంబ్లీ తర్వాత మేడిగడ్డ పోయి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలకు చెబుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదని, ఒకటి, రెండు పిల్లర్లు కృంగిపోవడం వల్ల ప్రాజెక్టుకు నష్టమేమి రాదని, గతంలో కూడా నాగార్జునసాగర్ నిర్మాణంలో పిల్లర్లు కృంగిపోవడం, మూసీ ప్రాజెక్టు ఊడిపోవడం జరుగలేదా అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు తాము మళ్లీ రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తామని, అప్పుడు తాము కూడా ఇలాగే మాట్లాడాలా అని కెసిఆర్ ప్రశ్నించారు.
ఆకలి చావులను లేకుండా చేసింది బిఆర్‌ఎస్ : మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులను లేకుండా చేసింది బిఆర్‌ఎస్ సర్కారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ జి.జగదీష్‌రెడ్డి అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పెంచిన కరువు, ఆకలి చావులను కెసిఆర్ ఆరేళ్లలో బాగు చేశారన్నారు. యాబై ఏళ్లలో రెండున్నర లక్షల మంది చావులు చూసిన ఫ్లోరోసిస్ మహామ్మారిని కూకటివేళ్లతో పెకిలించారన్నారు. గడిచిన నాలుగేళ్లలో మూడు లక్షల టన్నుల నుంచి నలుబై లక్షల టన్నుల వరి ధ్యానం పండేలా చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రెండు నెలలుగా సాగర్ ప్రాజెక్టు ఆంధ్రా చేతికి వెళ్తే ఎవరు పట్టించుకోలేదని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. సమావేశంలో బిఆర్‌ఎస్ నేతలు డాక్టర్ కె.కేశవ్‌రావు, నామ నాగేశ్వర్‌రావు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు టి.హరీష్‌రావు, మహమూద్ అలీ, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మదుసూదనాచారి, పువ్వాడ అజయ్‌కుమార్, వి.శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంఎల్‌ఎలు గాదరి కిషోర్, భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
కెటిఆర్ బస్సుపై కోడిగుడ్లతో దాడి
నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావుకు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలో కృష్ణానది జలాల కోసం బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభకు వచ్చిన మాజీ మంత్రుల బస్సుపై ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. పోలీసులను తప్పించుకుని బస్సు వెంట పడి కోడిగుడ్లు వేయడంతో వాహనమంతా కోడిగుడ్ల మయమైంది. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు గడిచిన పదేళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయకుండా కృష్ణానది జలాల పేరుతో జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గోబ్యాక్ బిఆర్‌ఎస్ లీడర్స్ అని నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
చర్లపల్లి వద్ద రోడ్డుప్రమాదం…
* ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న హోంగార్డు మృతి.. మరొకరికి గాయాలు..
ప్రజాపక్షం/నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన బిఆర్‌ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో సభ ముగిసిన అనంతరం వాహనాలు వెళ్లిపోయే సమయంలో చర్లపల్లి వద్ద ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న నార్కట్‌పల్లి హోంగార్డు కిషోర్‌ను ఢీకొనడంతో కారు పల్టీకొట్టింది. కిషోర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో హోంగార్డుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
* ఎమ్మెల్యే లాస్య కారుకు ప్రమాదం
బిఆర్‌ఎస్ కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత నల్లగొండలో జరిగిన బిఆర్‌ఎస్ సభకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో నార్కట్‌పల్లి సమీపంలో కారు ఢీకొనడం జరిగింది. అతివేగంగా కారు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడినట్లు సమాచారు.
నదులు, నీటిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు
RELATED ARTICLES