ప్రజాపక్షం/హైదరాబాద్: ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెకు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొం దుతూ బుధవారం అర్ధరాత్రి విజయనిర్మల తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు ప్రముఖ నటుడు నరేష్ ఒక్కరే సంతానం. ఆయన ప్రస్తుతం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. ఆమె భౌతికకాయాన్ని గురువారం ఇంట్లోనే ఉంచి శుక్రవారం ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు. విజయనిర్మల భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడేళ్ల వయస్సులో తమిళ చలనచిత్ర రంగప్రవేశం చేసిన విజయనిర్మల 200లకు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. పాండురంగ మహా త్మ్యం ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం. కృష్ణ, విజయనిర్మల ఇద్దరు కలిసి సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి ‘అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ’గా గిన్నిస్ రికార్డును సాధించారు. అయితే, ఎప్పటికైనా 50 సినిమాలకు దర్శకత్వం వహించాలన్న ఆమె కల మాత్రం నెరవేరలేదు. 15కు పైగా చిత్రాలను నిర్మించారు. ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంక య్య అవార్డును సైతం అందుకున్నారు. హీరోయిన్గా నటించిన తన తొలి చిత్రం ‘రంగులరాట్నం’కి నంది పురస్కారం అందుకుని ఘనమైన ఎంట్రీ ఇచ్చారు. బాలనటి, నటిగా మెప్పించిన విజయనిర్మల నిర్మాతగా కూడా ఆకట్టుకున్నారు. విజయకృష్ణ పతాకం అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన ఆమె.. 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971 నుంచి 2009 వరకు దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
నటి, దర్శక నిర్మాత విజయనిర్మల కన్నుమూత
RELATED ARTICLES