HomeNewsBreaking Newsనకిలీ విత్తనాలతో కలవరం

నకిలీ విత్తనాలతో కలవరం

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమాదం
గ్రామాల్లో అధికారుల నిఘా కరువు
నివారణకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
ప్రజాపక్షం/వరంగల్‌ ఈ ఏడాది జూన్‌ మొదటి వారం నుండే రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో మరికొన్ని రోజుల్లో వ్యవసాయ వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 1 తరువాత వర్షాలు పడితే విత్తనాలు విత్తేందుకు అన్నదాతలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈ సారి రుతుపవనాలు గతంలో కంటే ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఆ మేరకు ఇప్పటి నుంచే విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు నాసీరకం, కల్తీ విత్తనాలను అంటగట్టే ప్రమాదం పొంచి ఉంది. గత సంవత్సరం జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు పట్టుపడిన పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ‘నకిలీ’ బెడద తప్పదేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. దీంతో నకిలీ విత్తనాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుని మండల, డివిజన్‌, జిల్లాల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. వీటికి తోడు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందాలు పలు మండలాల్లో విత్తన దుకాణాలపై ఇప్పటికే దాడులు ప్రారంభించాయి. అయితే గ్రామాల్లో పటిష్టమైన నిఘా లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు, ప్రభుత్వం అనుమతి లేని విత్తనాలు వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు
గుంటూరు, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రభుత్వం అనుమతి లేని నకిలీ విత్తనాల సరఫరాతో పాటు మిర్చినారు వస్తున్నది. వివిధ గ్రామాల్లో కంపెనీలు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైతులకు విక్రయిస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహబూబాబాద్‌, ములుగు జిల్లాలలో గిరిజన రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని రైతులకు నకిలీ విత్తనాలు అంటకట్టి నట్టేట ముంచుతున్నారంటున్నారు. గ్రామాలతో పాటు జిల్లా కేంద్రాలలోని పలు విత్తన షాపుల్లో నకిలీ మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
గత ఏడాది రైతుల ఆందోళన
గత ఏడాది విక్రయించిన విత్తనాల వల్ల మిర్చిపంట పండక పోవడంతో అనేక గ్రామాల రైతులు పలు ప్రాంతాల్లో విత్తన దుకాణాల ఎదుట ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో రైతులకు కొంతమేర నష్టపరిహారం అందించి పోలీసు కేసులు కాకుండా జాగ్రత్తపడ్డారు. జిల్లాలోని గ్రామాల్లో వ్యవసాయ అధికారుల అప్రమత్తం, నిఘాలేక పోవడంతోనే నకిలీ విత్తనాల బెడద ఎక్కువైందని రైతులు చెబుతున్నారు. జిల్లాలలో ఈ ఏడాదైనా విత్తన సీజన్‌లో టాస్క్‌ఫోర్స్‌ బృందాల నిఘా పెంచి నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments