ప్రజాపక్షం/ క్రీడా విభాగం: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు సంతోషకరమైన వార్తే. గత కొంత కాలంగా ఫామ్‌లేమితో బాధపడుతున్న ధావన్ ఐపిఎల్ ద్వారా మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ధావన్ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. గత ఏడాది చివర్లో స్వదేశంలో జరిగిన వెస్టిండీస్ సిరీస్‌లో ధావన్ అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత జరిగిన విదేశీ పర్యటనల్లో ధావన్ నిరాశ పరిచాడు. ఫామ్‌ను కోల్పోయి పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు మళ్లీ ఐపిఎల్ ద్వారా పాత ఫామ్‌ను అందుకున్నాడు. దీనిపై టీమిండియా యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శనలతో దాదాపు ఆరేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు ఆడిన ధావన్ ఈసారి తన సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోయాడు. తొలిసారి ఢిల్లీ జట్టుకు ఆడిన ధావన్ ఈ సీజన్లో ఆకట్టుకున్నాడు. పృథ్వీ షాతో కలిసి తమ జట్టుకు ఎన్నో శుభారంభాలు అందించాడు. ఈ ఐపిఎల్ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ధావన్ (34.73) సగటుతో 521 పరుగులు చేశాడు. అందులో (135.67) స్ట్రయిక్ రేట్‌తో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒక మ్యాచ్ లో అత్యధికంగా 97 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అంతే కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలు ధావన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఢిల్లీ జట్టు చాలా కాలం తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ప్రదర్శనలతో టీమిండియాకు అండగా ఉండాలని ఆశిద్దాం.
ఐసిసి టోర్నీల్లో మెరుగైన రికార్డులు..
ద్వైపాక్షిక సిరీసులతో పోలిస్తే బహుళ దేశాలు తలపడే మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. ఐసిసి నిర్వహించే పెద్ద ఈవెంట్లలో ధావన్ అన్ని గణాంకాల్లో తనదైన ముద్ర వేస్తూ టాప్ లేపుతాడు. ఈ సారి ఇంగ్లాండ్ వేదికగా ఐసిసి ఆధ్వర్యంలో జరగనున్న మెగా సమరంలోనూ ఈ ఢిల్లీ బాద్షా చెలరేగడం ఖాయమనిపిస్తోంది.
ఐసిసి టోర్నీల్లో ధావన్ రికార్డులను ఓసారి చూస్తే..
శిఖర్ ధావన్ ఇప్పటి వరకు ఐసిసి టోర్నీల్లో 18 మ్యాచులు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ రెండు సార్లు, ప్రపంచకప్ ఒకసారి ఆడాడు. వీటిలో 97.71 స్ట్రయిక్రెట్, 65.47 సగటుతో మొత్తం 1113 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ గడ్డపై కూడా ధావన్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్‌లో ఆడిన 17 వన్డేల్లో (65.06 సగటు), 976 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీసేనకు ఆనందాన్నిచ్చే అంశం. 2019 ప్రపంచకప్ సైతం ఇంగ్లాండ్‌లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.
2015 ప్రపంచ కప్‌లో సత్తా చాటాడు..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 2015 ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి సత్తా చాటాడు. సౌతాఫ్రికాపై (137) శతకంతో మెరిసాడు. ఈ మ్యాచ్‌లో భారత్ సఫారీ జట్టుపై 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్‌పై ఇంకో శతకం బాదాడు. తర్వాత మ్యాచుల్లోనూ సత్తా చాటి మొత్తం 412 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
ధావన్ ఫామ్లోకొచ్చాడోచ్..
RELATED ARTICLES