HomeNewsTelanganaధాన్యం వ్యాపారుల దోపిడీ

ధాన్యం వ్యాపారుల దోపిడీ

మార్కెట్‌ ముందు రైతుల ఆందోళన
అడ్తి వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించిన జాయింట్‌ కలెక్టర్‌
మార్కెట్‌లో అక్రమాలపై విచారణ జరపాలి :
సిపిఐ నాయకుడు సిహెచ్‌ రాజారెడ్డి
ప్రజాపక్షం /జనగామ ప్రతినిధి జనగామ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల దోపిడి మొదలైంది. ధాన్యానికి రూ.2023లు మద్దతు ధర చెల్లించాల్సి ఉండగా తేమ పేరుతో రూ.1526లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్‌ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ మార్కెట్‌కు చేరుకొని విచారించారు. తక్కువ ధర వేసిన వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించారు. తేమ ఉన్న ధాన్యం రూ.1900లకు తక్కువ కొనుగోలు చేయొద్దని ఆదేశించారు. కాగా మార్కెట్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటూ, గత రెండేళ్లుగా జరిగిన దోపిడీపై విచారణ చేపట్టాలని, తక్కువ ధర వేసిన వ్యాపారుల లైసెన్స్‌ను రద్దు చేయాలని జనగామ మాజీ ఎంఎల్‌ఎ, సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. జనగామ ప్రాంతంలో దిగుబడి అయినా రబీ ధాన్యం ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తుంది. అయితే ఆశించిన మేరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు సైతం తేమ ఉన్న ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తున్నారు. అయితే 17శాతం తేమ ఉన్న ధాన్యానికి రూ.2023లు మద్దతు ధర చెల్లించాల్సి ఉండగా 18 నుండి 20 శాతం తేమ ఉన్న ధాన్యానికి పూర్తి స్థాయిలో ధర తగ్గిస్తున్నారు. బుధవారం లింగాలఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మధు అనే రైతు 60 సంచుల ధాన్యం తెచ్చారు. కమీషన్‌ ఎజెంట్‌ (వ్యాపారి) రూ.1523ల ధర మాత్రమే వేశాడు. ఈ ఒక్క రైతుకు సంబంధించే కాకుండా అనేక మంది రైతుల ధాన్యం ధరల్ని తెగ్గ్గోశారు. క్వింటాలుకు రూ.700లు ధర తగ్గడంతో మండిపడిన రైతులు మార్కెట్‌ కార్యాలయ కార్యదర్శిని నిలదీశారు. ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేశారు. విషయం కలెక్టర్‌కు తెలపడంతో వెంటనే అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ మార్కెట్‌కు చేరుకొని విచారించారు. పెద్దమొత్తంలో ధర తగ్గించడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారని మార్కెట్‌ కార్యదర్శిని నిలదీశారు. వ్యాపారులు చెప్పిన సమాధానం సరిగా లేకపోవడంతో మండిపడిన ఆయన ధర తగ్గించి కొనుగోలు చేసిన వ్యాపారి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించారు. తేమ ఉన్న ధాన్యాన్ని సైతం రూ.1900లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని హెచ్చరించారు. వ్యాపారులు రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. పరిశీలిస్తామని అదనపు కలెక్టర్‌ హామీ ఇచ్చారు.
రెండేళ్లుగా జరిగిన మోసంపై విచారణ జరపాలి : సిహెచ్‌ రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి
జనగామ మార్కెట్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉండగా రెండేళ్ల క్రితమే ఏత్తేయించారు. ఇది సరియైంది కాదని అప్పటి నుండే తాను అధికారులకు వివరించారు. రెండేళ్ల నుండి ధరల్లో కోత పెట్టి కొనుగోలు చేస్తున్నారు. రైతుల్ని నిండా ముంచుతున్నారు. మద్దతు ధర రూ.2023లు ఉంటే రూ.1526లకు కొనుగోలు చేయడం దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. మార్కెట్‌లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులు ఆరబెట్టుకునే అవకాశం కల్పించడంతో పాటు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments