ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కీలకం

ఎంఎల్‌సి ఎన్నికల్లో బలమైన స్వతంత్రులపై ప్రధాన పార్టీల నజర్‌ : వారికి పడే ఓట్లలో మిగతా ప్రాధాన్యం కోసం వల
ప్రజాపక్షం / హైదరాబాద్‌
ఈ నెల 14న జరగనున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. గతంలో మాదిరిగా ద్విముఖమో, త్రిముఖమో కాకుండా, నలుగురైదుగురు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీనికి తోడు బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. దీంతో ద్వితీయ, తృతీయ, ఇతర ప్రాధాన్యత ఓట్ల ప్రాముఖ్యత పెరిగిం ది. హైదరాబాద్‌ నియోజకవర్గంలో 93, నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది పోటీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సిట్టింగ్‌ ఎంఎల్‌సి రామచంద్రరావు (బిజెపి) వామపక్షాలు బలపరుస్తున్న ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, వాణీదేవి (టిఆర్‌ఎస్‌), డాక్టర్‌ జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్‌), ఎల్‌.రమణ(టిడిపి) మధ్య పోటీ కేంద్రీకృతమైంది. నల్లగొండలో సిట్టింగ్‌ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టిఆర్‌ఎస్‌), సిపిఐ అభ్యర్థి జయసారధిరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ (టిజెఎస్‌), రాములు నాయక్‌ (కాంగ్రెస్‌) తీన్మార్‌ మల్మన్న, రాణి రుద్రమ (ఇండిపెండెంట్‌), డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ), ప్రేమేందర్‌రెడ్డి(బిజెపి) తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగే ఎన్నిక కావడంతో పోటీలో అంతో ఇంతో ఓట్లు పడతాయని భావిస్తున్న బలమైన స్వతంత్ర అభ్యర్థులపై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. వారికి పడే ఓట్లలో ఇతర ప్రాధాన్యత ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.
సగం ఓట్లు వస్తేనే సొంతంగా గెలుపు : సాధారణ ఎన్నికలకు భిన్నంగా శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో ఓటింగ్‌ ఉంటుంది. అంటే ఒక్కరికే కాకుండా పోటీలో ఉండే అభ్యర్థులందరికీ ఓటు వేసే ప్రాధాన్యతా ఓటింగ్‌ విధానాన్ని అవలంబిస్తారు. పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లలో సగం ఓట్లుకు ఒకటి జోడించి కోటాగా నిర్ణయిస్తారు. అంటే వంద ఓట్లు చెల్లితే 50కి ఒకటి కలిపి 51 ఓట్లను కోటాగా ఎన్నికల అధికారులు నిర్ధారిస్తారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు తొలుత 51 ఓట్లు సాధిస్తారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో అవసరమైన కోటా ఓట్లు రానట్లయితే, అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్‌ చేసి, ఆ బ్యాలెట్‌లో ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఉన్న వ్యక్తికి దానిని బదిలీ చేస్తారు. గత ఎన్నికల్లో నల్లగొండ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో నిర్దేశిత కోటాను ఏ అభ్యర్థి అందుకోలేకపోయారు. అన్ని ప్రాధాన్యత ఓట్లు అయిపోయాక కూడా ఎవరికి కోటా ఓట్లు రాకపోవడంతో, అత్యధిక ఓట్లు లభించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈసారి రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. వీరిలో చాలా మంది ఎన్నికలకు చాలా ముందుగానే రంగంలో దిగి, స్వంతంగా ఓట్లు కూడా చేర్పించుకున్నారు. దీంతో తమకు ద్వితీయ ప్రాధాన్యత ఓటు పడేలా చూడాలని స్వతంత్రులను ఇతర అభ్యర్థులు సంప్రదిస్తున్నట్లు సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?