గత పదేళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీలేదు
మంత్రులు ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి మండిపాటు
పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకుంటామని ధీమా
ప్రజాపక్షం/మఠంపల్లి గత 10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీచేయలేదని, తెలంగాణను దివాళాతీసిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర అర్అండ్బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు విమర్శించారు. టిఆర్ఎస్ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, స్కాములు తప్ప తెలంగాణలో ఒరగబెట్టింది ఏమీలేదని, ఏ మొహం పెట్టుకుని తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. కచ్చితంగా రాబో యే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 స్థానాలు గెలుచుకుంటుందని, నల్లగొండ ఎంపి అభ్యర్ధి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. అంతక ముందు మట్టపల్లి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని ఎఐసిసి రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్మున్షీతో కలసి మంత్రులు, పలువురు ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గాన్ని గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని, ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి జానారెడ్డి నల్లగొండను అభివృద్ది చేశారని, కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి ఎంతో సేవ చేశారయని ఆయన కుమారుడైన రఘువీర్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ ఎంపి అభ్యర్ధి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్‌కు పంపుతామన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల పుణ్యమా అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ కార్యకర్తలను అన్ని విధాలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చిన అండగా ఉంటామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వస్తుందన్నారు.దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 32వేల మెజార్టీ వచ్చిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డికి 64వేల మెజార్టీ వచ్చేలా కష్టపడి పనిచేస్తానన్నారు. ఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్‌కు పంపిస్తామని ఆయన అన్నారు.నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధి రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, నన్ను పార్లమెంట్‌కు పంపించి నా యొక్క బాధ్యత నాకు తెలియజేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చిన ముందుండి వారి కష్టాలను తీరుస్తానని, మా తండ్రి ఆదరించినట్లే నల్లగొండ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదిరించాలని ఆయన అన్నారు.దేశంలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధిగా తనను గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి,డిసిసి అధ్యక్షులు శంకర్‌నాయక్, చెవిటి వెంకన్నయాదవ్, రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.