అమలుకు ప్రయత్నిస్తున్న కేంద్ర సర్కారు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శ
ప్రజాపక్షం / హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాలను, రైతులు తిప్పికొట్టిన మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలుకు కుట్రలు పన్నుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అందులో భాగంగానే ప్రైవేటు కంపెనీల డిస్కామ్‌ల ద్వారా విద్యుత్ పంపిణీలోకి ప్రవేశించేలా నోటిఫికేషన్ విడుదల చేసిందని, అలాగే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వీటిని పోరాటాల ద్వారా తిప్పి కొడతామని హెచ్చరించారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, హైదరాబాద్ జిల్లా
కార్యదర్శి ఇ.టి.నర్సింహాలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానీ, అంబానీల నుండి బలవంతంగా విద్యుత్‌ను కొనుగోలు చేయించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కూనంనేని అన్నారు. ఆహార ధాన్యాలను కొనుగోలు , గోడౌన్‌లను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణకు పూనుకుంటుందని, పరోక్షంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆహార భద్రత కోసం ప్రభుత్వాలే ధాన్యం కొనుగోలు చేయాలని , ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలపై ఉన్నదన్నారు.
గవర్నర్ వ్యవస్థపై త్వరలో సెమినార్
ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారిన గవర్నర్ వ్యవస్థ పై త్వరలో ఒక సెమినార్‌ను నిర్వహించబోతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 14-18 తేదీలలో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభ గౌరవార్థం హైదరాబాద్‌లో ఈ సెమినార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సెమినార్‌కు మేధావులను, ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. జాతీయ మహాసభకు తెలంగాణ నుండి 86 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, 14న జరిగే బహిరంగ సభకు రాష్ట్రం నుండి వేల మంది తరలి వెళ్లనున్నారని, ఇందుకు రైళ్ళను బుక్ చేయనున్నట్లు తెలిపారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ : పాదయాత్రలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, ఆయన తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని, ఒక రోగ్ లాగా వ్యవహరిస్తున్నారని కూనంనేని తీవ్ర స్థాయిలో విమర్శించారు.తెలంగాణ ప్రజలకు, నాటి సాయుధ పోరాట చర్రితకు, సమాజానికి అన్యాయం చేసిన బిజెపికి చెందిన బండి సంజయ్‌క పాదయాత్ర చేసే అర్హత లేదన్నారు. 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటయోధులు ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలను బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారని, ఇందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతల వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మారక చిహ్నాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఎన్‌టిఆర్ పేరు మార్చడంపై ఖండన : ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ యూనివర్సిటీకి ఎన్‌టిఆర్ పేరు తీసేసి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని కూనంనేని తీవ్రంగా ఖండించారు. సంస్థలకు, చారిత్రక ప్రదేశాలకు పేర్లు మార్చడం మంచి పద్దతి కాదని, బిజెపి కూడా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని అంటోందని విమర్శించారు.