1నుంచి 7వ తేదీ వరకు
మోదీ పాలనలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
‘హైడ్రా’తో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
పులి మీద స్వారీ వంటివి
సిపిఐ జాతీయ కార్యదర్శి
కె.నారాయణ
మధ్యతరగతి, పేదల ఇళ్ల స్థలాల జోలికి వెళ్లకూడదు. వారి స్థలాలను క్రమబద్ధీకరించాలి. లేదా వారికి ప్రత్యామ్నాయం చూపాలి. కబ్జాలకు పాల్పడిన బడాబాబుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. కట్టడాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలను సాకుగా చూపే ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్
ప్రధాని మోదీ పాలనలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సిపి ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రకటించారు. ‘హైడ్రా’ పేరుతో అక్రమ కూల్చివేతలు పులి మీద స్వారీ లాంటిదని, భయపడి సిఎం రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగితే ఆ పులి ఆయననే తినేస్తుందని, అలాగే ముందుకెళ్తే ప్రజల మద్ద తు లభిస్తుందని రేవంత్ రెడ్డికి నారాయణ సూచించారు. హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్‌తో కలిసి డాక్టర్ నారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ పాత్రను పోషించే గవర్నర్‌ద్వారా కర్నాటక ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తుందని, ఇటువంటి చర్యలు ప్రమాదకరమని, బిజెపినే మోదీపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. మోదీ దయ వల్లనే అదానీ ప్రపంచ కుభేరుడు అయ్యారన్నారు.
అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి
ప్రభుత్వ కార్యాలయాలను కూలుస్తారా? అని ఎంఐఎం నేత ప్రశ్నించడాన్ని డాక్టర్ నారాయణ తప్పుపట్టారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలకు, కబ్జాదారుల ఫామ్‌హౌస్, ఫంక్షన్‌హాల్స్, విద్యా సంస్థలకు ముడిపెడుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డిని నారాయణ కోరారు. బడాబాబుల కట్టడాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలను సాకుగా చూపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
పేదలు, మధ్యతరగతి జోలికి వెళ్లొద్దు
హైడ్రా అంశంలో సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని డాక్టర్ నారాయణ అన్నారు. మధ్యతరగతి, పేదల ఇళ్ల స్థలాల జోలికి వెళ్లకూడదని, వారి స్థలాలను క్రమబద్దీకరించాలని, లేదా వారికి ప్రత్యామ్నాయం చూపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు స్థలాల్లో ఉన్న వాణిజ్య, వ్యాపార కట్టడాలను తొలగించాలని, కబ్జాలకు పాల్పడిన బడాబాబుల నుంచి డబ్బులు వసూలు చేయాలని, ‘ఎన్’ కన్వెన్షన్ అంశంలో సినీనటుడు నాగార్జున నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నాయకులు కెటిఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీనటుడు నాగార్జున లాంటి వారు తాము చెరువులలో నిర్మించలేదని, ర్మించలేదని కొలువాలని చెబుతున్నారని, చెరువులు కబ్జా చేసిన తర్వాత ఇంకా ంకా కొలవడం ఏమిటని ప్రశ్నించారు.