దేశద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తీవ్రమైన రాజద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్‌ ప్రత్యేక కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు చెప్పింది. పెషావర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వకార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. డిసెంబర్‌ 17 నాటికి ఇరు వైపులా వాదనలు పూర్తయినా, కాకపోయినా తుది తీర్పు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసిం ది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్థాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్‌లో పాలన సాగించిన ముషారఫ్‌.. ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచు కుంటున్నారు. అరుదైన అమైలాయిడోసిస్‌ వ్యాధి కారణంగా ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నారు. 2013లో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పిఎంఎల్‌) ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను ఆయన ఇళ్లల్లోనే నిర్బంధించారు. దాదాపు 100 మందికిపైగా న్యాయమూర్తులను తొలగించి పాలన సాగించారు. కాగా రాజద్రోహం కేసులో ఓ మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?