‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ/చండీగఢ్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ (జమిలీ ఎన్నికలు) అంశంపై కసరత్తు చేస్తుండగా.. విపక్షాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఆలోచన దేశం, అందులోని రాష్ట్రాలపై దాడి చేయడమే అని మండిపడింది. ముఖ్యంగా రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరు చూస్తుంటే సిఫార్సులు ఇప్పటికే నిర్ణయించినట్లు అనిపిస్తోందని హస్తం పార్టీ ఆరోపించింది. ‘ఒకే దేశం-, ఒకేసారి ఎన్నికలు.. భారత్ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇండియా రాష్ట్రాల సమూహమన్నారు. ఈ మేరకు రాహుల్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జమిల ఎన్నికల నిర్వహణ అవకాశాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ పైవిధంగా వ్యాఖ్యానించారు. కమిటీలో సభ్యుడిగా నియమితులైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇప్పటికే తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే కమిటీలో రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేకు చోటు కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఖర్గేకు బదులు మాజీ ప్రతిపక్షనేత గులామ్‌నబీ అజాద్‌ను ప్రభుత్వం కమిటీలోకి తీసుకోవడం గమనార్హం. కాగా, ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒనగూరేదేమిటి?: కేజ్రీవాల్
’ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ కాన్సెప్ట్ హేతుబద్ధతపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జమిలి ఎన్నికలతో సామాన్యులకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేంటని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలా? లేదంటే ఒకే దేశం- అందరికీ ఒకే రకమైన విద్య, వైద్యమా (ధనిక, పేదలందరికీ సమానంగా నాణ్యమైన చదువు). అసలు జమిలి ఎన్నికలతో సామాన్యుడికి కలిగే మేలు ఏంటి?” అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నలు సంధించారు. ఆదివారం హర్యానాలోని భివానీలో పంజాబ్ సిఎం భగవంత్ మాన్‌తో కలిసి పర్యటించనున్న వేళ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఉచితాలను అందించడం కంటే స్వావలంబన కల్పించేందుకే బిజెపి కట్టుబడి ఉందంటూ హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ సర్కార్ ఉచితంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తోందన్నారు. ‘ఖట్టర్ సాబ్.. మేం ప్రపంచ స్థాయి ఉచిత విద్య, వైద్యాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నాం. 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్, తాగునీరు అందిస్తున్నాం. ఇదే పనిని పంజాబ్‌లోనూ మొదలుపెట్టాం. ఈ సౌకర్యాలు కల్పించడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే హరియాణా ప్రజలు సైతం పొందబోతున్నారు’ అని పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి వినాశకరం
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనేది ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థకు వినాశకరమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరీ చూస్తుంటే.. ఇప్పటికే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారు. ట్విటర్ మాధ్యమంగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశాన్ని పరిశీలించే కమిటీ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఒవైసీ షేర్ చేస్తూ.. “ఈ నోటిఫికేషన్‌ని బట్టి చేస్తే, ఇది కేవలం ఫార్మాలిటీ కోసమేనని అనిపిస్తోంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదానికి వినాశకరమైనవి” అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ‘గ్యాస్’ ధరలను తగ్గించారన్నారు. ఒకవేళ మోదీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. మరో ఐదేళ్ల పాటు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మరో ట్వీట్‌లో.. కమిటీలోని ఇతర సభ్యులు ప్రభుత్వ అనుకూల అభిప్రాయాలను కలిగి ఉన్నారని, వాళ్లు పదే పదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యల ద్వారా ఇది స్పష్టమవుతోందని ఒవైసీ పేర్కొన్నారు. అయితే.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను అమలు చేయాలంటే.. ముందుగా భారత రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణలు, అనేక చట్టబద్ధమైన చట్టాలను సవరించవలసి ఉంటుందని సూచించారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరలిజం ప్రాథమిక స్వభావానికి విరుద్ధమని విరుచుకుపడ్డారు. ఈ అంశంపై నియామక కమిటీ చేస్తున్న పని ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకమైందని.. ఇదొక డమ్మీ కసరత్తు అని సెటైర్లు వేశారు.
దేశం, రాష్ట్రాలపై దాడే
RELATED ARTICLES