దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

సుప్రీంప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్య
సిఎఎ రాజ్యాంగబద్ధ్దమైనదని ప్రకటించేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రా జ్యాంగబద్ధమైనదిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే తప్పుబట్టారు. దేశం క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొంటున్నప్పుడు సుప్రీం కోర్టులో దా ఖలయ్యే పిటిషన్లు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగానీ, రాజ్యాంగం చట్టబద్ధతను అనుమానించేవిగా ఉండకూడదని హితవు పలికారు. ఇలాంటి పిటిషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సిఎఎని రాజ్యాంగబద్ధమైనదిగా ప్రకంటించి, అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ వినీత్‌ ధండా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణకు జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పౌరసత్వ చట్టంపై దేశంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం కోర్టు విధి అని, అంతేగానీ అది రాజ్యాంగబద్ధమైందని తాము ప్రకటించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్‌లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి డిసెంబరు 2019లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చట్టంతో ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని ప్రభుత్వం నచ్చచెబుతూనే ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?