HomeNewsBreaking Newsదేశంలో ప్రత్యేక పరిస్థితులు

దేశంలో ప్రత్యేక పరిస్థితులు

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం లక్ష్యాలు దెబ్బతింటున్నాయ్‌
సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా
ప్రజాపక్షం/హైదరాబాద్‌
దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని ఐప్సో జాతీయ నాయకులు, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం లక్ష్యాలు దెబ్బతింటున్నాయన్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని ఐప్సో కార్యాలయంలో ఆదివారం బొమ్మగాని ప్రభాకర్‌, రఘుపాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సయ్యద్‌ అజీజ్‌ పాషాతో పాటు ఐప్సో జాతీయ నేతలు మాజీ ఎంఎల్‌సి కె. యాదవ రెడ్డి, డాక్టర్‌ డి. సుధాకర్‌ హాజరయ్యారు. ఇటీవల మరణించిన మాజీ రాజ్యసభ్యులు సొలిపేట రామచంద్రా రెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందుపై బెదిరింపులకు పాల్పడిన సంఘటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ మణిపూర్‌ గత 50 రోజులుగా మంటల్లో కాలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్న మణిపూర్‌లో అల్లర్లను ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కామన్‌ సివిల్‌ కోడ్‌ ముందుకు తీసుకొచ్చిందని విమర్శించారు. జాతీయ 22వ లా కమిషన్‌ దీన్ని వ్యతిరేకించిందన్నారు. బహుళ సాంస్కృతి, సంప్రదాయాలు అచరించే భారతదేశంలో యూనిఫాం సివిల్‌కోడ్‌ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కేవలం అధికారం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మతతత్వాన్ని రెచ్చగొట్టుతుందన్నారు. ఈ తరుణంలో దేశంలో శాంతి సంఘీభావ ఉద్యమాలను బలోపేతం చేయటానికి ఐప్సో ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా బహుళ్యంలోకి వెళ్లాలన్నారు. యాదవ రెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. చరిత్ర కలిగిన సంఘం, శాంతి ఉద్యమాలను, దేశంలో నిర్వహిస్తూ, అన్ని పార్టీలను బకతాటిపైకి తీసుకొస్తుందన్నారు. ప్రపంచ శాంతి సంఘానికి అనుబంధంగా ఐప్సో తన పాత్రను నిర్వహిస్తుందన్నారు. ఈ శాంతి సంఘీభావ సంఘం బలోపేతం చేయటానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరారు. ఐప్సో జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ డి. సుధాకర్‌, బొమ్మగాని ప్రభాకర్‌ మాట్లాడుతూ ఇటీవల చండీఘర్‌లో జరిగిన జాతీయ మహాసభల డిక్లరేషన్‌ను, తీర్మానాలను, కార్యవర్గ సమావేశ నిర్ణయాలను వివరించారు. ఐప్సో కార్యక్రమాల వివరాలు, నివేధికను సమావేశంలో ఐప్సో రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్‌ ప్రవేశపెట్టారు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సభ్యత్వం నమోదు, సంఘం నిర్మాణంతో బలోపేతం చేసుకోవడం ద్బారా ఐప్సో కార్యక్రమాలను స్ఫూర్తివంతంగా విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఐప్సో రాష్ట్ర కార్యదర్శి కె.నాగేశ్వర్‌ రావు, అధ్యక్ష వర్గ సభ్యులు తిప్పర్తి యాదయ్య, మెట్ల జగన్‌, ఐఎస్‌సియుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌, వివిధ జిల్లాల నాయకులు ఉమామహేశ్‌, తిప్పర్తి మహేశ్‌, రవికిషోర్‌, బోగం శంకర్‌, ఖలీల్‌, బి.శ్రీనివాస్‌, శ్రీహరి, కమల్‌ రెడ్డి, రాజారామ్‌, శంకర్‌, పల్లె వీరస్వామి, రామ్‌ రెడ్డి, జిల్లా యాదయ్య, వెంకట్‌ రామ్‌రెడ్డి, వేణు, రామ్‌చంద్రారెడ్డి, రాకేష్‌, బొమ్మగాని నాగభూషణం, మాజీద్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments