దెబ్బకు దెబ్బ

80 మంది అమెరికా సైనికులు మృతి?
ఒక్కరూ చనిపోలేదు: డొనాల్డ్‌ ట్రంప్‌
వాషింగ్టన్‌: ఇరాక్‌లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాల రెండు స్థావరాలపై ఇరాన్‌ ప్రతీకార దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 80 మంది అమెరికా సైనికులు చనిపోయి ఉంటారని సమాచారం. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ అనే ఈ రెండు వైమానిక స్థావరాలపై డజన్‌కుపైగా ఖండాంతర క్షిపణులు(బాలిస్టిక్‌ మిస్సైల్స్‌) ఇరాన్‌ ప్రయోగించింది. అయితే ఈ దాడిలో అమెరికా సైనికులు ఎంత మంది చనిపోయారన్నది, నష్టం ఎంత జరిగిందన్నది అమెరికా ఇంకా స్పష్టంచేయలేదు. కానీ వైమానిక స్థావరాలపై దాడి జరిగిన విషయాన్ని మాత్రం పెంటగాన్‌ ధ్రువీకరించింది. కాగా దాడిలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేసే పనిలో అమెరికా ఉంది. ‘తాజా పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సమీక్షిస్తున్నారు, సరైన సమయంలో బదులిస్తాం’ అని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, తదుపరి చర్యలు ఆయన తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద గ్రూపుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాక్‌లో ఉన్న అంతర్జాతీయ కూటమి సైన్యంలో భాగంగా దాదాపు 5,000 మంది అమెరికా సైనికులు ఇరాక్‌లో ఉన్నారు. అయితే ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌ దాడిలో అమెరికాకు చెందిన వారు ఏ ఒక్కరూ చనిపోలేదని తెలిపారు.
అమెరికాకు ఇది కేవలం చెంపదెబ్బ: ఖమైనీ
అమెరికా శుక్రవారం జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ మిలిటరీ టాప్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసీమ్‌ సులేమాని చనిపోవడంతో ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగిందని తెలుస్తోంది. అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడిపై ఇరాన్‌ అగ్రనేత ఆయతొల్లా అలీ ఖమైనీ బుధవారం స్పందించారు.‘మేము మంగళవారం రాత్రి అమెరికాకు కేవలం చెంపదెబ్బ మాత్రమే కొట్టాం. ప్రతీకారదాడులు, సైనిక చర్యలు జరిగిన నష్టాన్ని పూరించలేవు. మధ్యప్రాచ్యంలో అమెరికా ఉనికి ముగింపజేయడమే ప్రధానం’ అని ఖైమైనీ చెప్పినట్లు ఇరాన్‌ ప్రభుత్వ టివి తెలిపింది. ‘క్షిపణి దాడిలో కనీసం 80 మంది ఉగ్రవాద అమెరికా సైనికులు మరణించి ఉంటారు’ అని కూడా ఇరాన్‌ ప్రభుత్వ టివి తెలిపింది.
ఖోమ్‌ నగరంలో ఖాసీమ్‌ సులేమానీకి ఇరాన్‌ నేత ఆయతొల్లా అలీ ఖమైనీ నివాళులరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తిరుగుబాటు ఇంకా బతికే ఉందని ఆయన వీరమరణం నిరూపిస్తోంది’ అన్నారు. ఖమైనీ ప్రసంగించిన హాల్‌లో అందరూ ‘డెత్‌ టు అమెరికా’ అని నినాదాలు చేశారు. అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే మరో 100 ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇదిలావుండగా అమెరికా బలగాలున్న రెండు వైమానిక స్థావరాలపై మొత్తం 22 క్షిపణుల దాడి జరిగిందని ఇరాక్‌ మిలిటరీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఇరాకీ బలగాల్లో ఎవరూ చనిపోలేదని కూడా పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?