HomeNewsLatest Newsదుష్టచతుష్టయం దోచుకుంటోంది

దుష్టచతుష్టయం దోచుకుంటోంది

కేంద్ర సర్కార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం
సెబి చైర్‌పర్సన్‌ అక్రమాలపై జెపిసి వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌
పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన ప్రదర్శన

ప్రజాపక్షం/హైదరాబాద్‌
అదాని అక్రమాలకు కొమ్ముకాస్తు అందులో భాగస్వామ్యమైన సెబీఛైర్‌ పర్సన్‌ అక్రమాలపై విచారణ జరిపించాలని టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదానీ అక్రమ ఆస్తులు, సెబీ ఛైర్‌పర్షన్‌ అక్రమాలపై జెపిసి(సంయుక్త పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు వేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఎఐసిసి దేశ వ్యాప్త పిలుపులో భాగంగా టిపిసిసి ఆధ్వర్యంలో గన్‌ పార్క్‌తో పాటు ఈడి కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈడి కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై ప్రసంగిస్తూ గుజరాత్‌కు చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, అదాని, అంబానిలతో కూడిన ఈ దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోందని ధ్వజమెత్తారు. అదాని అక్రమ ఆస్తులపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేసి విచారణ చేపట్టాని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తే, ప్రధాని మోదీ నాలుగు రోజుల ముందే పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేసుకుని, దొంగచాటుగా పారిపోయ్యారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధాన మంత్రులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు కాగా, ఆ తర్వాత అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ తన 11 ఏళ్ల పాలనలో రూ.1.15లక్షల కోట్లు అప్పులు చేసి దేశ ప్రజలపై మోయలేని భారం మోపారని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలు, సాగునీటి ప్రాజెక్టలను మొదలు పెట్టిన దార్శనికుడు ప్రప్రథమ ప్రధాన మంత్రి జవహార్‌ లాల్‌ నెహ్రుఅని, ఇందీరాగాంధీ భూసంస్కరణలు చేపట్టి భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేసి, వాటిని సాగు చేసుకునేందుకు రుణాల కోసం బ్యాంకులను జాతీయకరణ చేసి, పేదల జీవితాలలో వెలుగులు నింపిందని అన్నారు. సాంకేతిక విప్లవానికి దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ నాంది పలకగా, మరో దివంగత ప్రధానమంత్రి పివి నరసింహా రావు ఆర్థిక సంస్కరణల ,చేపట్టి ప్రపంచానికే మార్గదర్శకులయ్యారన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి వ్యవహారం మాత్రం ‘హమ్‌ దో.. హమారే దో’ అన్నట్లు ఉన్నదని ఎద్దెవా చేశారు. ఇద్దరి వ్యవహార శైలి దేశాన్నే కాదు ప్రపంచాని సైతం దోచుకునేలా ఉందన్నారు. మోదీపై కోట్లాడుతామని గొప్పలు పలికిన నాయకులు నేడు ఎక్కడికి పోయ్యారని పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదని, బిజెపి అక్రమాలపై బిఆర్‌స్‌ అధ్యక్షులు కెసిఆర్‌, ట్విట్టర్‌ టిల్లు కెటిఆర్‌లు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దేశ సంపదను దోచుకుంటున్న బిజెపికి బిఆర్‌ఎస్‌ అనుకూలం అనేందుకు ఇదే నిదర్శనమని, జెపిసిపై బిఆర్‌ఎస్‌ విధానం స్పష్టం చేయాలని సిఎం డిమాండ్‌ చేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, ‘మీ తాత ముత్తాతలు దిగొచ్చినా’ రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరన్నారు.
ఆదాని దోచుకున్న దేశ సంపద ప్రజలకు దక్కేవరకు పోరాటం: భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల ఆస్తులు కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ డి కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ సంపద దోపిడీకి గురికావద్దని, ఈ సంపద అంతా ఈ దేశ ప్రజలకు చెందాలని తమ నాయకుడు రాహుల్‌ గాంధీ పెద్ద ఎత్తున గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నరన్నారు. అదానీ దోచుకున్న ఆస్తులు దేశ ప్రజలకు చెందే వరకు, జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, దేశ సంపదను కాపాడే బాధ్యతను భుజస్కందాలపై వేసుకొని దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయం ఎదుట, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఏకోన్‌ ముఖంగా మంత్రులు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.
అనంతరం అదానీ కుంభకోణంపై ఈడి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎఐసిసి ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, సల్మాన్‌ ఖుర్షీద్‌, మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, టిపిసిస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎల్‌సి మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కూడిన ప్రతినిధుల బృందం ఈడి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఢిల్లీలో కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు
న్యూఢిల్లీ : సెబీ చీఫ్‌ మాధబి బుచ్‌ తన పదవికి రాజీనామా చేయాలని, అదానీ అంశంపై విచారణకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగా గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా ఢిల్లీ యూనిట్‌ నాయకులు, కార్యకర్తలు దేశ రాజధానిలో ప్రదర్శన నిర్వహించారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌, కన్హయ్య కుమార్‌, ఉదిత్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు జరగాలని కాంగ్రెస్‌ కోరుతున్నట్లు పైలట్‌ తెలిపారు. ఏ తప్పూ చేయకుంటే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం దేశం మొత్తం వినాలని, అర్థం చేసుకోవాలన్నారు. జెపిసి ద్వారా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ చైర్‌పర్సన్‌ మధాబీ బుచ్‌కి వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజా బ్రాడ్‌సైడ్‌ను ప్రారంభించిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments