HomeNewsBreaking Newsదశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలోగొప్పగా సాగాలి

దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలోగొప్పగా సాగాలి


ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేళ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్‌, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్‌ 2న ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం’లో నిర్వహించాలని కెసిఆర్‌ నిర్ణయించారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన సచివాలయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అవతరణ దినోత్సవాల సందర్భంగా అధికారిక కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో ఉన్నతాధికారులతో సిఎం చర్చించారు. అవతన దినోత్సవ వేడుకలను సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలో స్టేజి ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి కెసిఆర్‌ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్‌ సౌకర్యం, అతిథులకు ‘హైటీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎక్కడ, ఎలా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమని,ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నదన్నారు. విద్యుత్‌, వ్యవసాయంతో పాటు సాగు నీరు సహా ప్రతి రంగంలోనూ దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నదన్నారు. నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని సూచించారు. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్‌ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నదన్నారు. 24 గంటల విద్యుత్‌ ను రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నామని,ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదనే విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో కరెంటు లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, కన్వర్టర్లే కనిపించేవని గుర్తు చేశారు. గత పాలనలో విస్మరించిన విద్యుత్‌ ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టుదలతో పటిష్టపరుచుకోవడం ద్వారానే విద్యుత్‌ విజయం సాధ్యమైందని, విషయం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చిందన్నారు. విద్యుత్‌ రంగం తరహాలోనే వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలి. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకమవ్వాలని. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ధి ఉత్సవాలను ఆటపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సీఎం పునరుద్ఘాటించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి; ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌,ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి; సీఎం ప్రధాన సలహాదారు సోమేష్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, డిజిపి అంజని కుమార్‌, హైదరాబాద్‌ సిపి సి.వి.ఆనంద్‌, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి శ్రీనివాస రాజు, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఐ అండ్‌ పి ఆర్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, జాయింట్‌ డైరక్టర్‌ జగన్‌ తదితరులు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments