దండెత్తాయ్‌!

మిడతల దండు దాడి మళ్లీ షురూ
గురుగ్రామ్‌/న్యూఢిల్లీ : దేశంలో మిడతల దండయాత్ర మొదలైంది. పాకిస్థాన్‌ నుంచి దూసుకువచ్చిన మిడతలు కొన్ని వారాల క్రితం ఉత్తరాదిని భయపెట్టినప్పటికీ, కొన్ని రోజులపాటు కనపడలేదు. అయితే శనివారం ఉన్నట్టుండి మిడతల స్వైర విహారం భయోందళనకు గురిచేసింది. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మిడతల దాడి ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా శనివారం గురుగ్రామ్‌లో మిడతల దండు వీరవిహారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం ఉదయం 11.30 గంటలకు మిడతలు గురుగ్రామ్‌లోకి ప్రవేశించాయని వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి కె.ఎల్‌.గుర్జార్‌ లిపారు. ఇప్పుడవి హర్యానాలోని పల్వాల్‌ వైపు దూసుకుపోతున్నాయని తెలిపారు. ఢిల్లీలోని సికందర్‌పూర్‌, బెవర్లీపార్క్‌, గార్డెన్‌ ఎస్టేట్‌, హెరిటేజ్‌ సిటీల్లోనూ మిడతలు కన్పించాయని చెప్పారు. పాక్‌ నుంచి వచ్చిన ఈ మిడతలు మే నెలలో రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పంటలను నాశనం చేశాయి. అయితే దాదాపు మూడు వారాలపాటు దీని ప్రభావం కన్పించలేదు. కానీ హఠాత్తుగా శనివారం మిడతలు దాడి చేశాయి. ఇవి దక్షిణాది వైపు పయనించే ప్రమాదం వుందని గుర్జార్‌ హెచ్చరించారు. గత రెండు నెలల నుంచి రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా గురుగ్రామ్‌లో మొదలైన మిడతల దండు దాడి మెళ్లిగా ఢిల్లీలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంటలను నాశనం చేసే మిడతల దండు గురుగ్రామ్‌ సిటీతో పాటు సైబర్‌ హబ్‌ ప్రాంతమైన డిఎల్‌ఎఫ్‌ ఫేజ్‌ I-IV, చక్కర్‌పూర్‌, సికందర్‌పూర్‌, సుఖ్రాలి ఏరియాలో పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు శుక్రవారం సాయంత్రమే అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇంట్లోని వస్తువులను గట్టిగా వాయించడం, పటాకులు కాల్చడం, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. తాజా దండయాత్రతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?