త్వరలో మరో 8 లాజిస్టిక్స్‌ పార్కులు

ఔటర్‌ చుట్టూ పరిశ్రమలను స్థాపిస్తాం
మంగళ్‌పల్లి లాజిస్టిక్స్‌ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌
పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజాపక్షం/సిటీబ్యూరో/ఆదిబట్ల : ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మరో 8 లాజిస్టిక్స్‌ పా ర్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ ని మున్సిపల్‌, ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంగళ్‌పల్లి సమీపం లో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ) లాజిస్టిక్స్‌ పార్కును విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్‌ భాగస్వామ్య (పిపిపి) విధానంలో దేశంలోనే మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డువల్ల నగరం చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. మంగళ్‌పల్లి లాజిస్టిక్స్‌ పార్కుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. టాస్క్‌ ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలోనే బాటసింగారం లాజిస్టిక్‌ పార్క్‌ నిర్మాణం పూర్తి చేసుకొని కొత్త ఏడాదిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ముచ్చర్లలో 18వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, నగరంలో రెండు రైల్వే టెర్మినల్స్‌ రాబోతున్నాయని మంత్రి చెప్పారు. రైల్వే టెర్మినల్స్‌కు అనుసంధానిస్తూ మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం అభివృద్ధి చేస్తామని తెలిపారు. సరుకు రవాణాకు హైదరాబాద్‌ నగరం అనువైందని, మౌలిక వసతుల కల్పన పెంచి పారిశ్రామికాభివృద్ధిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బుద్వేల్‌ ప్రాంతంలో మరో ఐటి క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వెలిమినేడులో ఏరోస్పేస్‌ ప్రాజెక్టు రానుందని, నగరంలో ఎలక్ట్రికల్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కుంట్లూర్‌లో ఎస్‌టిపి నిర్మించడానికి రూ.14 కోట్ల నిధులను, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఒక్కో మున్సిపాలిటీకు రూ.10కోట్ల చొప్పున నాలుగు మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిబట్లలో మరిన్ని ఐటి కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాలు యువతకు లభించే అవకాశముందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఇక్కడ రాబోతోందని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?