ధర్మశాల: అందరూ ఊహించిందే జరిగింది.! భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఆగుతూ.. పడుతూ దాగుడు మూతలు ఆడిన వర్షం.. ఊరించి ఊరించి ఆఖరకు టాస్ పడకుండానే మ్యాచ్‌ను తడిచిపెట్టేసింది. ఫలితంగా ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లకు నిరాశే ఎదురైంది. ఇరు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ లక్నో వేదికగా ఆదివారం జరగనుంది. గురువారం తెల్లవారుజాము వరకు పడిన వర్షం మధ్యాహ్నం కాసేపు విరామం ఇచ్చింది. సూర్యుడు కూడా రావడంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను సిద్దం చేసే పనిమొదలు పెట్టారు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ వేయడం ఆలస్యం చేశారు. కవర్లు తీసి మైదానాన్ని పరీక్షిద్దామనగా.. కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఫ్లడ్‌లైట్లు వెలిగించారు. కానీ వర్షం మళ్లీ మొదలవ్వడంతో కవర్లు కప్పేశారు. అప్పటి నుంచి వర్షం ఆగూతూ.. వస్తూ ఆటగాళ్ల, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. సాయంత్రం 6:30 గంటలకు మైదానం సిద్ధమైతే 20 ఓవర్ల మ్యాచు ఆడిద్దామని భావించినా.. ఆ అవకాశమే కనిపించలేదు. మరింత ధాటిగా వర్షం పడటంతో చేసేదేమిలేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఓవైపు వర్షం.. మరోవైపు కరోనా భయంతో ప్రేక్షకులు కూడా పెద్దగా మైదానానికి రాలేదు. దీంతో గ్రౌండంతా బోసిపోయింది. ఇరు జట్ల మధ్య ఇక్కడ మ్యాచ్ రద్దవ్వడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన టీ20 కూడా ఒక్క బంతిపడకుండానే రద్దయింది.
తొలి వన్డే వర్షార్పణం
RELATED ARTICLES