తొలి పోరు

నేడు భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య మొదటి వన్డే
జోరుమీదున్న టీమిండియా
పటిష్టంగా ఆస్ట్రేలియా
రసవత్తరంగా సాగనున్న మ్యాచ్‌
మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబయి : సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ భారత్‌కు అసలైన సవాలుగా మారింది. ఇప్పటి వరకు పలు సిరీస్‌లు గెలిచినా ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం అనుకున్నంత తేలికకాదు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయమనే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాకు భారత్‌పై మెరుగైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. భారత గడ్డపై కూడా ఆస్ట్రేలియా పలుసార్లు సిరీస్‌లను సొంతం చేసుకుంది. కిందటిసారి జరిగిన సిరీస్‌ కూడా కంగారూలకే దక్కింది. కానీ, ఇటీవల కాలంలో టీమిండియా చాలా బలోపేతంగా తయారైంది. ఫార్మాట్‌ ఏదైన విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఇంటాబయటా అనే తేడా లేకుండా వరుస సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది. అంతేగాక విండీస్‌ను వారి దేశంలోనే చిత్తు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియానే విజేతగా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించినా ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం భారత్‌కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు జట్ల మధ్య ఎప్పుడూ సిరీస్‌ జరిగినా అది నువ్వానేనా అన్నట్టు సాగడం పరిపాటిగా తయారైంది. ప్రతి మ్యాచ్‌ కూడా చివరి వరకు ఆసక్తికరంగా సాగడం సిరీస్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సీనియర్‌ క్రికెటర్లు వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల చేరికతో ఆస్ట్రేలియా మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఫార్మాట్‌ ఏదైనా విజయం సాధించడం ఆస్ట్రేలియాకు అలవాటుగా మారింది. జట్టు ప్రదర్శన చూస్తుంటే మునుపటి జట్టును తలపిస్తోంది. ఇటీవల జరిగిన అన్ని సిరీస్‌లలో కూడా కంగారూలు అజేయంగా నిలిచారు. న్యూజిలా్‌ండ పాకిస్థాన్‌, శ్రీలంక తదితర జట్లతో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియా ఏకపక్ష విజయాలు సాధించింది. కానీ, భారత్‌తో జరిగే సిరీస్‌ మాత్రం కంగారూలకు కూడా అంత తేలిక కాదని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. కాగా, ఆతిథ్య భారత జట్టు మాత్రం ఈ సిరీస్‌ను ప్రతిష్టాతక్మకంగా తీసుకుంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా రానున్న న్యూజిలా్‌ండ పర్యటనకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని తహతహలాడుతోంది. శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా జోరుమీద కనిపిస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ మాత్రం భారత్‌కు ఒక సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. సమష్టిగా రాణిస్తే తప్ప ఇందులో విజయం సాధించడం కష్టమే. ఇక, ఇందులో టీమిండియా ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.
ఓపెనర్లపైనే అందరి దృష్టి..
ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లపై అందరి దృష్టి. చాలా కాలం తరువాత జట్టులోకి వచ్చిన శిఖర్‌ ధవన్‌ శ్రీలంకతో సిరీస్‌లో బాగానే రాణించి తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక శ్రీలంకతో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ ప్రస్తు సరీస్‌కు జట్టులోకి రానున్నాడు. అంతేకాదు వీరిద్దరు మరో వంద పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని అందిస్తే అరుదైన రికార్డును నెలకోత్పనున్నారు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన జోడీగా రికార్డు సృష్టిస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం వెస్టిండీస్‌ ఆటగాళ్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌ జంటతో (భారత్‌పై 6) కలిసి రోహిత్‌-ధావన్‌ సమంగా నిలిచారు. మూడో స్థానంలో ధోనీ-యువరాజ్‌ సింగ్‌ ఉన్నారు. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌పై అయిదు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆసీస్‌పై రోహిత్‌-ధావన్‌కు మంచి రికార్డు ఉంది. వీరిద్దరు కలిసి ఆసీస్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు చేశారు. శ్రీలంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసీస్‌ వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. అయితే ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన ధావన్‌ కూడా శ్రీలంకపై అర్ధశతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో రాహుల్‌ను నాలుగోస్థానంలో పంపించి హిట్‌ జోడీగా పేరున్న రోహిత్‌-ధావన్‌ను ఓపెనర్లుగా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి వేదికగా రేపు తొలి మ్యాచ్‌, జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో ఆఖరి మ్యాచ్‌ జరగనుంది.
రోహిత్‌కు గాయం..
నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ వేసిన త్రోను క్యాచ్‌ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలికి గాయం అయింది. దీంతో హిట్‌మ్యాన్‌ కొద్దిసేపు సాధనకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్‌ సెషన్‌ పూర్తి చేశాడు. ఈ విషయంపై జట్టు యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రేపు మ్యాచ్‌ స్టార్ట్‌ అయ్యే ముందు మాత్రం ఫిజియోలు రోహిత్‌ గాయాన్ని మరోసారి పరీక్షించి ఫైనల్‌ డెసిషన్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రోహిత్‌ శర్మకు శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ రెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ధావన్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడమే కాకుండా అద్భుతమైన ఫామ్‌ను కూడా కొనసాగించాడు. దీనితో టెస్టుల్లో రోహిత్‌-ధావన్‌ల కాంబినేషన్‌ను కుదిర్చిన జట్టు యాజమాన్యం.. టీ20ల్లో మాత్రం ధావన్‌ కన్నా రాహుల్‌కే ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తోంది.
బౌలింగ్‌లో రాణించాలి..
భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఈసారి కూడా కీలకంగా మారారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. కిందటి పోటీలో నవ్‌దీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌ అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కిందటిసారి పెద్దగా ప్రభావం చూపని బుమ్రా ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌లతో స్పిన్‌ విభాగం చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా లంక బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇదిలావుండగా శ్రీలంకకు ఈ మ్యాచ్‌ పరీక్షగా తయారైంది. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓడిపోవడంతో సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో చిక్కుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే లంక సిరీస్‌ సమం చేయగలుగుతోంది. ఒక వేళ ఓడి పోతే మాత్రం సిరీస్‌ను కోల్పోక తప్పదు. దీంతో ఈ మ్యాచ్‌ను లంక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారత్‌ను ఓడించి సిరీస్‌ను సమంగా ముగించాలని భావిస్తోంది. దీని కోసం గురువారం జట్టు ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. సీనియర్‌, జూనియర్‌ ఆటగాళ్ల కలయికతో లంక బలంగానే ఉంది. అయితే నిలకడలేమి ఒక్కటే జట్టుకు సమస్యగా తయారైంది. ఆ లోటును పూడ్చుకుంటే భారత్‌ను ఓడించడం పెద్ద సమస్యేమి కాదు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌లో టి20 సిరస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా.. రెండో మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే లంకేయులను కట్టడి చేశారు. ఇక చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో యంగ్‌ బౌలింగ్‌ దళం షేనీ, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి వారు చెలరేగారు. ఇదే స్పూర్తితో ఆస్ట్రేలియాపైనా రాణిస్తే.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించవచ్చు.
సచిన్‌ రికార్డుకు చేరువలో.. కోహ్లీ
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ లెజె్‌ండ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుపై కన్నేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన వన్డే ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుని సమం చేయనున్నాడు. భారత్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(20 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఆ రికార్డుకి ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేరువయ్యాడు. స్వదేశంలో ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్‌ సరసన నిలుస్తాడు. నేటి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన సచిన్‌ రికార్డుని సమం చేస్తాడు. ఇటీవలే పూణె వేదికగా శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం శ్రీలంకతో మూడో టీ20లో తొలి పరుగు తీసి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌), ధోని(భారత్‌), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. కాగా, భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. రికీ పాంటింగ్‌ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్‌ 303 మ్యాచ్‌ల్లో 11,561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు.
భారత జట్టు
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ షైనీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ.

DO YOU LIKE THIS ARTICLE?