తొలగని ఉత్కంఠ

ఆర్‌టిసి సమ్మెపై ఎటూ తేల్చని కెసిఆర్‌ ప్రభుత్వం
రూట్ల పర్మిట్లపై హైకోర్టు తీర్పు వచ్చాకే నిర్ణయం
ఆర్‌టిసిని యథాతథంగా నడపడం సాధ్యం కాదు
కూలంకషంగా అధ్యయనం చేస్తామని ప్రకటన
సమ్మెపై నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన సిఎం, నేడు మళ్లీ సమీక్ష

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో టిఎస్‌ఆర్‌టిసిని యధావిధిగా నడపడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌టిసి సమ్మె, హైకోర్టులో కేసు, సమ్మె ఉపసంహరణపై ఆర్‌టిసి జెఎసి చేసిన ప్రకటన తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం గురువారం ప్రగతిభవన్‌లో నాలుగు గంటలపాటు జరిగింది. సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌టిసి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా కొనసాగుతున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌక ర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్‌టిసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక భారాన్ని భరించలేం
“టిఎస్‌ఆర్‌టిసి ఇప్పుడున్నట్లు నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ ఆర్థిక భారమంతా ఎవరు భరించాలి. ఆర్‌టిసికి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్‌టిసికున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆర్‌టిసిని యధావిధిగా నడపడం సాధ్యం కాదు” అని సమావేశం అభిప్రాయపడిందని సిఎంఓ తెలియజెసింది. “ఆర్‌టిసికి ఇప్పటికే రూ.5 వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్‌ నెలకు సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సిసిఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65 నుంచి రూ.70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని సిఎంఓ వివరించింది. సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌ రావు, సునిల్‌ శర్మ, రామకృష్ణ రావు, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌, అడిషనల్‌ ఎజి రాంచందర్‌రావు, ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు టి.వెంకటేశ్వరరావు, ఇ. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?