తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌!

కేంద్రానికి సిఫార్సు చేసిన కొలీజియం
హిమాచల్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సిజెల పేర్లూ ఖరారు

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నియమితులయ్యే అవకాశం వుంది. ప్రస్తు తం ఆయన తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు ఆయన పేరునే కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణతోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కూడా పేర్లను ఖరారు చేసి, జాబితాను కేంద్రానికి పంపించింది. నాలుగు రాష్ట్రాల హైకోర్టు సిజెల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసినట్లు పేర్కొంటూ మే 10వ తేదీ కొలీజియం తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ను తెలంగాణ హైకోర్టు సిజెగా నియమించాలని ప్రతిపాదించగా, తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సిజెగా, ఢిల్లీ హైకోర్టు సిజెగా జస్టిస్‌ డిఎన్‌ పటేల్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు సిజెగా జస్టిస్‌ ఎ.ఎ.ఖురేషీని సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని కొలీజియంలో జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వి రమణలు సభ్యులుగా వున్నారరు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ రాజేంద్ర మీనన్‌ త్వరలోనే పదవీ విరమణ చేయనుండటంతో కొత్త చీఫ్‌ జస్టిస్‌గా అర్హత ప్రాతిపదికగా జస్టిస్‌ పటేల్‌ను సిఫార్సు చేసినట్లు కొలీజియం పేర్కొంది. గుజరాత్‌ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం బదిలీపై జార్ఖండ్‌ కోర్టులో పనిచేస్తున్నారు. మద్రాసు హైకోర్టుకు చెందిన జస్టిస్‌ సుబ్రమణియన్‌ ప్రస్తుతం బదిలీపై తెలంగాణ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. అన్ని అర్హతలున్న ఆయనను హిమాచల్‌ ప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా నియమించడం సరైన చర్య అవుతుందని కొలీజియం పేర్కొంది. అలాగే గుజరాత్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఖురేషీ ప్రస్తుతం బదిలీపై బాంబే హైకోర్టు జడ్జిగా వున్నారు. ఆయనను మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ విషయంలో ఇటీవలనే ఆ రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పడిందని, దానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ను నియమించారని, ఆయననే పూర్తిస్థాయి చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సిఫార్సు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?