HomeNewsBreaking Newsతెలంగాణ సాయుధపోరాటంలోపాటే ప్రధానం

తెలంగాణ సాయుధపోరాటంలోపాటే ప్రధానం

కమ్యూనిస్టులదే ప్రధాన పాత్ర… ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర శూన్యం
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌
ప్రజాపక్షం / డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నగర్‌
భారత దేశ స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటంలో పాటనే ప్రధానమని, ఆ తర్వాత నాటకం ప్రధానపాత్ర పోషించిందని తెలంగా ణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని, కమ్యూనిస్టులదే ప్రధాన పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర మూడవ మహాసభలో భాగంగా రెండవ రోజున హైదరాబాద్‌, బొగ్గులకుంటలో ని డాక్టర్‌ సి.నారాయణరెడ్డి నగర్‌ (తెలంగాణ సారస్వత పరిషత్తు)లోని దాశరథి రంగాచార్య వేదికలో “తెలంగాణ సాధనలో తొలి, మలి దశల సాహిత్యం”అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. అరసం రాష్ట్ర కార్యదర్శి కెవిఎల్‌ సభాధ్యక్షతన జరిగిన సదస్సులో అయాచితం శ్రీధర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాట, నాటకం, ఆట ప్రధాన పాత్రను పోషించిందని ఆయన అన్నారు. నిజాం ప్రభుత్వం, ప్రజల మధ్యనే పోరాటం జరిగిందని, దీనిని కొందరు వక్రీకరిస్తున్నారని తెలిపారు. గౌరవ అతిథి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ పాలకులు, రాజ్యం మార్గాన్ని రచయితలు, కవులు వదిలిపెట్టాలని, ప్రజల పక్షాన నిలబడాలని, అప్పుడే వారికి సరైన గౌరవం లభిస్తుందన్నారు. తెలంగాణలో తిరుగుబాటు లేకపోతే నాటి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ మలిదళ పోరాటమే వచ్చేది కాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారు ఆ నాటి చరిత్రను రాయకపోవడంతో రికార్డులు లేని తెలంగాణ సాయుధ పోరాటంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఆత్మీయ అతిథి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ గ్రామాల చరిత్రను నిక్షిప్తం చేస్తే మంచిగ్రంథంగా, సాహితీ సంపదగా మారుతుందన్నారు. మానవ సంబంధాలు మాయమైతున్న క్రమంలో కవులు, రచయితలు స్పందించి, మానవ సంబంధాలను బలపడేలా కృషి చేయాలని సూచించారు. అఖిల భారత అరసం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ఒక నిబద్ధతను, క్రమశిక్షణను నేర్పిందన్నారు. ఈ పోరాటంలో సాహిత్యం ముఖ్యపాత్రను పోషించిందన్నారు. ప్రముఖ కవి, నవలా రచయిత కాలువ మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటం, మలిదశ పోరాటం కాలంలో వచ్చిన కథలను ఒక సంకలనంగా తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కెవిఎల్‌ మాట్లాడుతూ మనుషుల్లో మానవత్వం పరిఢవిల్లాలన్నదే అరసం ఆలోచన అని అన్నారు. ఈ సదస్సులో ప్రముఖ సాహిత్య విమర్శకులు కె.పి.అశోక్‌ కుమార్‌తో పాటు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాపోలు సుదర్శన్‌ , బొమ్మగాని నాగభూషణం, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ పల్లేరు వీరస్వామి, నిధి,ఎల్లేశ్వర్‌, తిరుపాల్‌, కమల హాజరయ్యారు. కాగా వేముల ప్రభాకర్‌ సంపాదకత్వంలో ముద్రించిన “రాఘవ పట్టణం రామసింహకవి ఆత్మకథ”ను అయాచితం శ్రీధర్‌, కాలువ మల్లయ్య సంయుక్తంగా ఆవిష్కరించారు. అరసం రాష్ట్ర కోశాధికారి సోమశిల తిరుపాల్‌ వచనా సంపుటి“తరమెల్లిపోతుంది” అనే పుస్తకాన్ని పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సదస్సులో అతిథులకు ఎం.శంకర్‌ నారాయణ స్వాగతం పలుకగా, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.చంద్రమోహన్‌ గౌడ్‌ వందన సమర్పణ చేశారు.
ప్రాచీన సాహిత్యాం నుండే ఉత్తమ సాహిత్యం: ఆచార్య పిల్లలమర్రి రాములు
ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినప్పుడే ఉత్తమ సాహిత్యం సాధ్యమని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాచార్యలు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. తాపీ ధర్మారావు వేదికపైన “ఈ దశాబ్ధి సాహిత్యం(2014 నుండి నేటి వరకు)” అనే అంశంపై జరిగిన సదస్సుకు తెలంగాణ అరసం ఉపాధ్యక్షుడు శ్రీనిధి సభాధ్యక్షత వహించగా ఆచార్య పిల్లలమర్రి,తెలంగాణ సారస్వత పరిషత్తు పూర్వ ప్రధానాచార్యలు ఎం.నరహరి,తెలంగాణ ఉర్ధూ అరసం నాయకురాలు నిఖత్‌ అర షహీన్‌, పరిశోధక విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్‌, ప్రముఖ సాహిత్య విమర్శకులు నాళేశ్వరం శంకరం సోమశిల తిరుపాల్‌, వై.లెనిన్‌ హాజరయ్యారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments