తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అద్వితీయం

ప్రొఫెసర్‌ రమా మెల్కోటే

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడారని ప్రొఫెసర్‌ రమా మెల్కోటే తెలిపారు. తమను తాము రక్షించుకుంటూ అజ్ఞాతంలోని నాయకుల రక్షణ బాధ్యతలు నిర్వహించారని, ఆయుధం కూడా పట్టి పోరాడారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలలో భాగంగా మంగళవారం “వీర తెలంగాణ పోరాటంలో మహిళల పాత్ర” అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌ లో ఆమె ప్రసంగించారు. తాము నాటి పోరాటంలో పాల్గొన్న 70 మంది మహిళల ఇంటర్వ్యూలతో ‘మనకు తెలియని మన చరిత్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించామని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు ఉద్యమ కాలంలోని ఉత్సాహమే కనిపించిందన్నారు. నిజాం కాలంలో మహిళలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని, భూస్వాముల నుండి వెట్టి చాకిరితో పాటు లైంగిక దాడులకు కూడా గురయ్యారని చెప్పారు. దీని నుండి విముక్తికి కమ్యూనిస్టులతోనే సాధ్యమని విశ్వసించారని, అందుకే ఆ పోరాటంలో ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అటు గ్రామాల మహిళలు, పట్టణాల మహిళలకు కూడా ఇందులో పాత్ర ఉండేద ని, గ్రామాలలో ఎక్కువగా పేద, రైతు కుటుంబాల మహిళలు, పట్టణాలలో మధ్యతరగతి నుండి వచ్చినవారు, ముస్లిం మహిళలు కూడా ఉన్నారన్నారు. మహిళలు సాయుధ పోరాటంపై పార్టీలో కొందరు అభ్యంతరం పెట్టినప్పటికీ, పట్టుబట్టి శిక్షణ పొంది ఆయుధం చేబూనారని వివరించారు. బ్రిజ్‌రాణి గౌర్‌ , ప్రమీలా తాయి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ వంటి మహిళలు చురుకైన పాత్ర పోషించారన్నారు. నాయకులు, దళాలు అజ్ఞాతంలో ఉన్నపుడు వారికి స్థావరం కల్పించే బాధ్యత మహిళలే చూసుకునేవారని, వారికి భోజనం వంటి ఏర్పాట్లు చేసేవారని అన్నారు. అలాగే అడవుల్లోకి వెళ్ళినప్పుడు మారు వేషాలతో ఉండేవారని, అక్కడ అనేక సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డారని రమా మెల్కోటే చెప్పారు. కొంత మంది గాయపడిన వారికి వైద్యం కూడా చేశారని, సులోచన అనే మహిళ ఒక వ్యక్తికి గాయమైతే ఏడు మైళ్ళు మోసుకొని సురక్షిత ప్రాంతంలో చికిత్స అందించి బతికించిందన్నారు. కమలమ్మ అడవిలోనే బిడ్డను కని, దళం, పార్టీ కోసం ఆ బిడ్డను ఎవరికో ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
జ్యోతి : రమా మెల్కొటే చక్కగా వివరించారు. మహిళలను నాటి పోరాటంలో భాగస్వామ్యం చేసుందుకు నాయకులకు కొంత మీమాంస ఉన్నా, మహిళలే ధైర్యంగా ముందుకు వచ్చి పాల్గొన్నారని అన్నారు. అయితే, సాయుధ పోరాటం ముగిశాక మహిళలకు ఆశించిన స్థానం లభించలేదని తెలిపారు. నాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల స్ఫూర్తితో నేటి మహిళలు సమానత్వం, రాజకీయ భాగస్వామ్యం కోసం పోరాడాలని సూచించారు. వెబినార్‌లో కొమురయ్య బృందం వీర తెలంగాణ ఒగ్గు కథ ప్రదర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌, కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ డి.సుధాకర్‌ల సమన్వయంతో ఈ వెబినార్‌ను నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?