HomeNewsBreaking Newsతెలంగాణ భవన్‌ వేదికగా బిఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు

తెలంగాణ భవన్‌ వేదికగా బిఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు

రసాభసగా చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశం
ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, తాండూర్‌ మాజీ ఎంఎల్‌ఎ పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వాగ్వాదం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ అధికారం కోల్పోయిన తర్వత గులాబీలో వర్గ విభేదాలు బట్టబయలవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విబేధాలు సాక్షాత్తూ బిఆర్‌ఎస్‌ అగ్రనేత ముందే బట్టబయలు కావడం ఆ పార్టీలో హాట్‌టాపీక్‌గా మారింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమావేశం రసాభసగా జరిగింది. మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ముందే ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, తాండూర్‌ మాజీ ఎంఎల్‌ఎ పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్‌లో సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మాజీ మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో చేవెళ్ల లోక్‌సభ సన్నాహాక సమావేశం జరిగింది. పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుండి దిగిపోవాలని పట్టుబట్టింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదిక మీద నాయకులు జోక్యం చేసుకున్నారు. అదే సమయంలో మహేందర్‌ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్‌ వర్గీయులు అడ్డుపడ్డారు. తాండూర్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ను పట్నం మహేందర్‌ రెడ్డి భ్రష్టు పట్టించారని, మహేందర్‌ రెడ్డి అనుచరులు పార్టీకి అనుకూలంగా పనిచేయకపోవడంతోనే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఓడిపోయారని ఆరోపించారు. ఆ వెంటనే మహేందర్‌రెడ్డి వర్గీయులు ఫైలట్‌ రోహిత్‌ రెడ్డి వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అలాగే పట్నం, పైలట్‌ మధ్య మాట మాట పెరిగి బాహబాహీకి దిగినట్టు తెలిసింది. మంత్రి హరీశ్‌రావుతో పాటు వేదిక మీద ఉన్న పలువురు జోక్యం చేసుకుని రెండు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత మహేందర్‌ రెడ్డి, పైలెట్‌ రోహిత్‌తో హరీశ్‌రావు మాట్లాడారు. కాగా తాండూరులో ఎంఎల్‌ఎను మార్చి ఇతురులకు అవకాశం కల్పిస్తే కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని మహేందర్‌ రెడ్డి వర్గీయులు అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణమైందని, ఇటువంటి సమావేశాలు గతంలోనే నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవారిమని వారు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments