అధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశం
జగిత్యాల జిల్లా రాంపూర్‌వద్ద పంప్‌హౌస్ నిర్మాణ పనుల పరిశీలన
మేడిగడ్డ బ్యారేజీ పనుల పర్యవేక్షణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా పలు బ్యారేజీలను, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలను, విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తి చేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నదని, వలసపాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు స్వయం పాలనలో యుద్ధప్రాతిపదికన పూర్తి కావస్తుండడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రైతుకు సాగునీటిని అందించాలనే ప్రభుత్వ ప్రధా న ప్రాధాన్యతకు తగ్గట్టుగానే సాగునీటిశాఖ ఇంజినీర్లు అధికారులు నిపుణులు పని చేస్తండడం గొప్ప విషయమన్నారు. అందరి సమష్టి కృషి వల్లే కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టుల నిర్మాణం ముగింపు దశకు చేరుకున్నాయని సిఎం అభినందించారు. మరికొద్ది రోజుల్లో వానలు కురిసి వాగు లు, వంకలు పొంగి, గోదావరి నదీ జల ప్రవాహం సాగనున్న నేపథ్యంలో అక్కడక్కడ మిగిలి వున్న ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, వీలైనంత త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని తెలంగాణ బీళ్లకు మళ్లించాలని నీటిపారుదల శాఖ అధికారులను, వర్క్ ఏజెన్సీలను సిఎం కెసిఆర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఫంప్‌హౌస్ నిర్మాణం పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరిశీలించారు. అక్కడనుంచి మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ పనులను పర్యవేక్షించారు. హెలీకాప్టర్‌లో ఏరియల్ వ్యూ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టు పక్కన వ్యూపాయింట్ నుంచి మేడిగడ్డ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడనుంచి బ్యారేజీ మీదుగా ప్రయాణించి, ప్రాజెక్టుకు బిగింపును పూర్తి చేసుకున్న 85 గేట్లను అక్కడక్కడ ఆగి పరిశీలించారు. ఆ తర్వాత బ్రిడ్జి దిగి కాఫర్ డ్యాం మీదుగా గేట్లు నిర్మాణమవుతున్న ఐదు ప్రదేశాల్లో అక్కడక్కడా ఆగి పరిశీలించారు. అక్కడే పనిచేస్తున్న కార్మికుల క్షేమ సమాచారాలను సిఎం అడిగితెలుసుకున్నారు. కార్మికులు ఎండను సైతం తట్టుకొని పనిచేయడం పట్ల అభినందనలు తెలిపారు. పక్కనే పాయలా పారుతున్న గోదావరి నదిలోపలికి దిగి నడుచుకుంటూ ముందుకువెల్లి మొక్కు పైసలను సిఎం జారవిడిచారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం సిఎం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. “మేడిగడ్డ ప్రాజెక్టు అన్నిపనులను పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మొత్తం 85 గేట్ల బిగింపు పూర్తయ్యాయి. కాగా డ్యాంనుంచి చుక్కనీరు పోకుండా చేసేందుకు బిగించే రబ్బరు సీలింగ్ పని కూడా పూర్తి కావొచ్చింది. మొత్తం 85 గేట్లకు గాను 26 గేట్లకు ఇప్పటికే రబ్బరు సీలు ఫిక్సింగ్ పనులు పూర్తి కాగా, మిగిలిన 59 గేట్లకు బిగించాల్సి వున్నది. ఈ పనిని వారం పదిరోజుల్లో పూర్తిచేయాలి” అని సిఎం ఆదేశించారు. గోదావరి నదీజలాలను వీలైనంత వరకు జూన్ నెలలోనే వినియోగంలోకి తేవాల్సిన అవసరాన్ని సిఎం స్పష్టం చేశారు. మేడిగడ్డ పని పూర్తి చేసుకుని తద్వారా ప్రాణహిత నుంచి వచ్చే జలాలను ఈ సీజన్ లోనే బ్యారేజీలో నిలువరించాలన్నారు. మేడిగడ్డ నుంచి కన్నేపల్లి పంపుహౌస్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి, అక్కడనుంచి సుందిల్ల బ్యారేజీలోకి రివర్స్ పంపింగ్ చేయడానికి సంబంధించిన పంపుహౌస్‌ల నిర్మాణాలు కూడా త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సిఎం సూచించారు. అన్నారం సుందిల్ల బ్యారేజీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కన్నేపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీలకు 3 టిఎంసిల నీటిని తోడుకపోయే సామర్థ్యం గల 13.5 కిలోమీటర్ల అతిపెద్ద కాల్వ పనికూడా పూర్తయిందని వివరించారు. అలా నీటిని ఎల్లంపెల్లి వరకు ఎత్తిపోసి అక్కడనుంచి ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న నంది మేడారం పంపులద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి వరుదకాల్వకు కాళేశ్వరం జలాలను చేరవేయాలని సిఎం అన్నారు. అదే వరద కాల్వ ద్వారా కిందికి మిడ్ మానేర్ డ్యాంను నింపాలన్నారు. అటునుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించవచ్చని సిఎం అన్నారు. రాంపూర్ పంప్‌హౌస్ వరదకాల్వలో నిర్మిస్తున్న రాజేశ్వరరావు పేట పంపుహౌస్, ముప్కాల్ పంపు హౌస్‌ల నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని సిఎం అన్నారు. వీటి ద్వారా నీటిని రివర్ప్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి ఎత్తిపోసి అటు పాత ఆయకట్టును స్థిరీకరించడం ఇటు మిడ్ మానేర్‌లో నీటిని నింపి మల్లన్నసాగర్ దాకా నీటిని తరలించి ఈ సీజన్‌లో తెలంగాణ చెరువులను నింపాలన్నారు.