ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఆదివారంనాడు మరో ముగ్గురు చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 21 మంది మరణించారు. కేసుల సంఖ్య 858కి పెరిగాయి. ఇంకా 651 మంది చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్నవారిలో సీరియస్ కేసులంటూ ఏమీ లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో జీరో కరోనాకేసులు వున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి, సిద్దిపేటలో కరోనా కేసుల్లేవని చెప్పారు. కేసులు రెట్టింపవుతున్నాయన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వుందని, దేశంలో 8 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతుండగా, మన రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మరో వారం రోజులు పట్టవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మరణాల శాతం 2.44 మాత్రమే వుందన్నారు. వైద్య పరికరాల కొరత మన రాష్ట్రంలో లేదని వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో పిపిఇ కిట్లు, మాస్కులు వంటి పరికరాలు సిద్ధంగా వున్నాయన్నారు. మందులు కూడా అవసరానికి సరిపడా వున్నాయని చెప్పారు. దాదాపు 42 దేశాలు లాక్‌డౌన్‌లో వున్నాయి. అతి ఎక్కువ ఉన్న దేశాల విషయానికొస్తే, చైనాలోని వుహాన్‌లో 72 రోజులు లాక్‌డౌన్ వుందన్నారు. భారత్‌లో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 20వ తర్వాత సడలింపులు ఇవ్వాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. కానీ మన రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ సడలింపులు ఇవ్వరాదని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించిందని కెసిఆర్ వెల్లడించారు.
తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు, 3 మరణాలు
RELATED ARTICLES