HomeNewsTelanganaతెలంగాణను దగాచేసిన కెసిఆర్‌

తెలంగాణను దగాచేసిన కెసిఆర్‌

కాళేశ్వరానికి లక్షకోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్ళవ్వలేదు
2020లోనే బ్యారేజీకి ముప్పు ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు ఎల్‌ అండ్‌ టికి లేఖ రాసినా పట్టించుకోలేదు
మేడిగడ్డను సందర్శించిన సిఎం, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు
బిఆర్‌ఎస్‌, బిజెపి శాసనసభ్యులు గైరుహాజరు…

బొమ్మగాని కిరణ్‌ కుమార్‌
మేడిగడ్డ నుండి ప్రజాపక్షం ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు గత ప్రభుత్వం లక్ష కోట్లను ఖర్చు పెట్టి, కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకు రూ.94 వేల కోట్లను ఖర్చు చేసి, కేవలం 98, 570 ఎకరాల ఆయకట్టుకు నీరందించారన్నారు. కాళేశ్వరం అవకతవకలపైన మాజీ సిఎం కెసిఆర్‌, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్‌ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగైదు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కెసిఆర్‌ బాధ్యతారహితంగా, చులకనచేసి మాట్లాడుతున్నారని, ఇందులో ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అలకగా ఎలా మాట్లాడుతారని, నిలదీశారు. తెలంగాణను కెసిఆర్‌ దగా చేశారన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌ రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎంఎల్‌ఎలు కౌసర్‌ మొయినుద్దీన్‌, జాఫర్‌ హుస్సేన్‌, జుల్ఫీకర్‌ అలీ, ఎంఎల్‌సి అఫెండి, టీచర్‌ ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో పాటు కాంగ్రెస్‌, ఎంఐఎం శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పనులను మంగళవారం పరిశీలించారు. కాగా బిఆర్‌ఎస్‌, బిజెపి ఎంఎల్‌ఎలు దూరంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పనులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు అంశాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ తదితర అంశాలపైన నీటిపారుదల శాఖ ఇన్‌చార్జ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ రెడ్డి, మేడిగడ్డ బ్యారేజీపై ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ నివేదికను రాజీవ్‌ రతన్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేవనెత్తిన పలు ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. అనంతరం సిఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలై పోయిందని దుయ్యబట్టారు. ఈ పాజెక్ట్‌కు ప్రతి ఏటా విద్యుత్‌ చార్జీల నిమిత్తం రూ. 10, 500 కోట్లు, బ్యాంక్‌ రుణాలు, ఇతరాత్ర చెల్లింపుల నిమిత్తం ప్రతి ఏటా రూ. 25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉన్నదని, ఇన్ని నిధులు ఖర్చుపెట్టినప్పటికీ ప్రతి ఏటా రూ. 19,63,000 ఎకరాలకు మాత్రమే నీరు అందేపరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం పైన కెసిఆర్‌ అబద్ధాల ప్రచారాలతో కాలం గడిపారన్నారు. 2020 సంవత్సరంలోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టికి లేఖ రాసినా, ఈ సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లారని, దీంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైందని విమర్శించారు. కెఆర్‌ఎంబి విషయంలో ఏనుగు పోయింది, తోక మాత్రమ మిగిలిందని, ఆ తోకనే లాగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లపై కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, కెసిఆర్‌ తన రెండు కాళ్లలో ఒకటి విరిగితే ఎందుకు ఆస్పత్రికి వెళ్లారని ప్రశ్నించారు. అవినీతిపరులకు చట్టం, ఒక విధానం, పద్దతి ప్రకారం శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.
నీళ్లు నింపితే ప్రమాదమే
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారని,ఈ మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవని, నీళ్లు నింపితే పెను ప్రమాదమేనని రేవంత్‌ రెడ్డి అన్నారు. నీళ్లు నింపితే అంతా కొట్టుకుపోతుందన్నారు. ఏ క్షణమైనా కుప్పకులేందుకు సిద్ధంగా ఉందన్నారు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. బ్యారేజీల్లో నీళ్లు నింపితే సమస్యలకు కారణమవుందునే ఉద్దేశంతోనే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం నీళ్లు నింపలేదన్నారు.
కూత వేటు అసెంబ్లీకి రావా..
కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కెసిఆర్‌, నల్లగొండ సభకు ఎలా వెళ్లారని సిఎం రేవంత్‌ రెడ్డి నిలదీశారు. నల్లగొండ దూరమా? ,అసెంబ్లీ దూరమా?అని ప్రశ్నించారు. రీడిజైన్‌ పేరుతో వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కెసిఆర్‌ నల్లగొండలో సభ పెట్టుకున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ప్రజల ముందు తన బండారం బయటపడుతుందని నల్లగొండ సభ ద్వారా కెసిఆర్‌ తమపై ఎదురుదాడికి పాల్పడ్డారన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టానని కెసిఆర్‌ ఇప్పటికే కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారన్నారు. కెసిఆర్‌ సత్య హరిశ్చంద్రుడైతే శాసనసభలో చర్చకు ఎందుకు రావడం లేదన్నారు. కెసిఆర్‌ చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. మేడిగడ్డ సందర్శనకు రావాలని తమ మంత్రి లేఖ రాశారని, దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే , వెళ్లే తేదీని నిర్ణయించినా అందకు తాము సిద్ధమే అన్నా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు ఎందుకు రాలేదన్నారు. కెఆర్‌ఎంబిపై తాను సలహలు ఇచ్చేవాడినని కెసిఆర్‌ చెబుతున్నారని, తామూ శాసనసభలో అదే చెప్పామని, సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని, అందుకు అవసరమైతే చర్చను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరిన విషయాన్ని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. కెఆర్‌ఎంబిలో లోపాలు ఉన్నాయని చెబుతున్న కెసిఆర్‌, లోపలు ఉన్న తీర్మానానికి హరీశ్‌రావు ఎలా మద్దతిచ్చారని నిలదీశారు. హరీశ్‌రావు మాటలకు విలువ లేదని తాము ముందే చెప్పామన్నారు. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదని, ముందు శాసనసభకు రావాలని హితువుపలికారు.
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కెసిఆర్‌
కెసిఆర్‌ తమను వెంటాడుతాయపి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై చర్చకు రావడానికి కెసిఆర్‌ ఎందుకు భయపడుతున్నారన్నారు. గత సిఎం కార్యదర్శిగా కెఆర్‌ఎంబికి రాసిన లేకలో కెసిఆర్‌ అనుమతి లేకుండా ఆ లేఖను రాశారా?అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కెసిఆర్‌ మాట్లాడుతున్నారని, కెసిఆర్‌ గురించి ప్రజలకు ముందే తెలిసి ఉంటే ప్రస్తుత ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కు కుర్చీ పోగానే నీళు,నల్లగొండ ఫ్లోరైడ్‌ గుర్తొస్తాయన్నారు. అబద్దాలు నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా అని అన్నారు. అన్ని పాపాలకు కారణం కెసిఆర్‌ అని, తన స్వార్ధం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చాలని సూచించారు. కెసిఆర్‌ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుర్చీ పోయిందనే కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండకు వెళ్లారని, పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని కెసిఆర్‌ ఎత్తుగడ అని అన్నారు. కాళేశ్వరం అవినీతి చర్చకు రాకుండా ఉండెందుకే నల్లగొండలో కెసిఆర్‌ సభ పెట్టుకున్నారన్నారు. కెసిఆర్‌ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ ఇక వచ్చేది కాళేశ్వరానికి కాదని, ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సిందేనని అన్నారు.
చీకటి ఒప్పందాలు ఇంకేన్నాళ్లు
బిజెపి,బిఆర్‌ఎస్‌ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ సందర్శనకు బిజెపి ఎంఎల్‌ఎలు రాకుండా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అడ్డుకున్నారన్నారు. కెసిఆర్‌ అవినీతికి సంబంధించిన కీలకమైన మేడిగడ్డ సందర్శనకు బిజెపి ఎంఎల్‌ఎలు ఎందుకు రాలేదని, అవినీతి, కెసిఆర్‌ అంశంలో బిజెపి వైఖరి ఏమిటోస్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో చెప్పాలన్నారు. కెసిఆర్‌ అవినీతిని సిబిఐ చేతికి వస్తే, కెసిఆర్‌ జుట్టు తమ చేతిలో ఉంటుందని బిజెపి భావిస్తుందని, అందుకే సిబిఐ విచారణ కోరుతుందన్నారు. బిజెపికి న్యాయస్థానంపై నమ్మకం లేదని, అందుకే సిబిఐ విచారణ అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. పదేళ్లు ఏ కేసులో కూడా సిబిఐ, ఈడి, ఆధాయ పన్ను శాఖ విచారణ చేపట్టలేదని గుర్తు చేశారు.
చుక్క నీరు పారకపోయినా ప్రతి ఏటా రూ.10వేల కోట్లు చెల్లించాల్సిందే : ఉత్తమ్‌
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీలలో నీళ్లు నిల్వ కచేయకపోవడంతో ప్రాజెక్ట్‌ ప్రశ్నార్థకంగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కమార్‌ రెడ్డి అన్నారు. చుక్క నీళ్లు పారించకపోయినా ప్రతి ఏటా రూ.10వేల కోట్లు చెల్లించాల్సిందేని, ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన కుంభకోణం స్వతంత్ర భారతదేశంలో కెసిఆర్‌ ప్రభుత్వం పాల్పడిన అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు ఎన్‌డిఎకు విచారణ లేఖ రాస్తామని, అన్ని తప్పిదాలపై చర్యలు ఉంటాయన్నారు.
తెలంగాణ గుండె పగిలింది : కూనంనేని సాంబశివ రావు

మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు కాదని, ఇది తెలంగాణ ప్రజల గుండె పగుళ్లు అని సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివ రావు అన్నారు. డిజైన్‌, నాణ్యత లోపంతో ప్రాజెక్ట్‌ను నిర్మించిన వారిని జైలులో పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. మూడు ఏళ్లలో నిర్మించిన బ్యారేజీ ఎనిమిదేళ్లలో కూలిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత అన్యాయంగా నిర్మించిన వారిని ఏం చేయాలన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌ కోసం నాటి సిపిఐ ఎంఎల్‌ఎగా గుండా మల్లేష్‌ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. 1950 కాలంలోనాడు కాటన్‌ దోర నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ నిలబడిందని గుర్తుచేశారు. జిడిపి ఇలా అన్నింట్లో నంబర్‌ వన్‌ అని చెప్పుకున్నప్పటికీ ఉన్న నిధులన్నీ గత ప్రభుత్వం కాళేశ్వరంలో పెట్టిందని, అందుకే ఉద్యోగులకు కూఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఇంత అన్యాయంగా ప్రాజెక్ట్‌ను నిర్మించిన వారిని ఏం చేయాలని, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి తమకు బాధ్యతనే లేదని చెబుతున్నదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేయడమే తప్పుగా చేసిందని, ప్రజా ధనాన్ని వృదా చేసిందని దుయ్యబట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి, ప్రచారం చేసుకున్నారన్నారు. మోతాదుకు మించిన నీటిని నిల్వ చేసి, ప్రాజెక్ట్‌ను నాశనం చేశారని, ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలోనే అతి పెద్ద లోపం ఉన్నదన్నారు. గత ప్రభుత్వ ఇన్ని కుంభకోణాలు చేసి, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎగ్గొడుతున్నరని మాట్లాడుతోందని మండిపడ్డారు. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లేనని, ఇంకా పదేళ్లయినా అయిన ఈ ప్రాజెక్ట్‌ పూర్తీ స్థాయిలో అందుబాటులోకి రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఇలా చూడడం బాధాకరమని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments