తెలంగాణకు 79 టిఎంసిల నీళ్లు

కృష్ణా బోర్డును కోరిన తెలంగాణ ఇంజినీర్లు
నీటి లెక్కలు తేలకుండానే ముగిసిన సమావేశం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణకు 79టిఎంసిల కృష్ణా నీరు కావాలని తెలంగాణ నీటిపారుదల ఇంజినీర్లు కృష్ణా బోర్డును కోరారు. జలసౌధలో గురువారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా పరివాహక ప్రాంత ఇంజనీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంజినీర్లు యాసంగి కోసం నవంబర్‌ వరకు 79 టిఎంసీల నీళ్లు కావాలని కృష్ణాబోర్డును కోరగా ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్లు 150టిఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నెల 15వ తేదీన ఇరు రాష్ట్రాల నీటిపారుదల ఇంజనీర్‌ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో వర్కింగ్‌ మాన్యువల్‌పై చర్చ జరుగుతుందని బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు కృష్ణా నీటి కేటాయింపులపై చర్చ జరుగుతుందని, అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు స్పష్టం చేసింది. ఈ సమావేశంలోనే వాటర్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీటి విడుదల అంశంపై ఇఎన్‌సిల సమావేశంలోనే తేల్చుకోవాలని ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు నాలుగు ప్రధానాంశాలపై చర్చ జరిపారు. పోతిరెడ్డిపాడు, కెసి కెనాల్‌, ఎన్‌సిపి లెఫ్ట్‌ కెనాల్‌, కెడిఎస్‌ ప్రాజెక్టుల నుంచి ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్‌ వాడుకుందని తెలంగాణ వాదించింది. పోతిరెడ్డిపాడు వాస్తవ డిశ్చా ర్జి, రికార్డుల నమోదయిన దానికి మధ్య 18 టిఎంసిల తేడా ఉందని తెలంగాణ వాదించింది. అయితే కేవలం 3 టిఎంసిలు మాత్రమే తేడా ఉందని ఎపి స్పష్టం చేసింది. అలాగే కెసి కెనాల్‌ వాస్తవ డిస్జార్జికి, రికార్డుల్లో నమోదైన దానికి మధ్య తేడా 8.5 టిఎంసిలు ఉందని తెలంగాణ పేర్కొంటే, ఏపి అది వాస్తవం కాదు, కేవలం 2.26టిఎంసీలు మాత్రమే తేడా ఉందని ఏపి స్పష్టం చేసింది. సాగర్‌ ఎడమ కాల్వకు అనుకున్నంత నీటి పరిమాణం వస్తే సమస్యకు పరిష్కారమవుతుందని ఏపి తెలిపింది. కృష్ణా డెల్టాలో గోదావరి నీటిని వినియోగించుకున్నామని, పట్టిసీమ ద్వారా 21.97 టిఎంసిలు నీటిని లిఫ్ట్‌ చేశామని వీటిని కృష్ణా జలాల వినియోగపు ఖాతాలో వేయవద్దని ఏపి తెలిపింది. కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోతుంటే పట్టిసీమ ద్వారా నీటిని ఎలా లిఫ్ట్‌ చేస్తారని తెలంగాణ ప్రశ్నించింది. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్ల వాదనలు, ప్రతిపాదనలు, భిన్నాభిప్రాయాల మధ్య నీటి లెక్కలు కొలిక్కిరాకముందే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా బోర్డు ఎస్‌ఇ ఆర్‌వి.ప్రకాష్‌, డిఇ శ్రీధర్‌, తెలంగాణ డిసిఇ నరహరిబాబు, ఏపి కర్నూల్‌ ఎస్‌ఇ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?