తెరపైకి యుపిఎ-3

23న ప్రతిపక్షాలతో సోనియా భేటీ
డిఎంకె, టిడిపి, జెడి(ఎస్‌), ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పిలకు కాంగ్రెస్‌ అధినేత్రి లేఖలు
టిఆర్‌ఎస్‌, వైసిపి, బిజెడిలకూ ఆహ్వానం?
బిజెపి కూటమికి వ్యతిరేకంగా యుపిఎ-3 ఏర్పాటుకు సన్నాహాలు

న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏడు దశల పోలింగ్‌కు తెరపడనున్న దృష్ట్యా, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్నికల అనంతర పొత్తులపై దృష్టిసారించాయి. ముఖ్యంగా యుపిఎ-3 ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. బిజెపిని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా యుపిఎ-3 ఏర్పాటు దిశగా ప్రాంతీయ పార్టీలతో సమావేశానికి ఆమె సమాయత్తమయ్యారు. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే రోజునే న్యూఢిల్లీలో ప్రతిపక్షాలతో సోనియా సమావేశం కానున్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతీయ పార్టీలకు ఆమె ఆహ్వానం పలికారు. ఇప్పటికే డిఎంకె, టిడిపి, జెడి(ఎస్‌), ఎన్‌సిపి, బిఎస్‌పి, ఎస్‌పిలకు ఆమె లేఖలు పంపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ ధృవీకరించారు. తనకు సోనియాగాంధీ నుంచి ఆహ్వానం లభించిందని స్టాలిన్‌ గురువారంనాడు మీడియాకు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన మే 23వ తేదీనే ఈ సమావేశం వుంటుందని ఆయన వెల్లడించారు. టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపి, బిజెడిలకు కూడా ఆహ్వానం పలికే అవకాశం కన్పిస్తున్నాయి. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగనోహన్‌రెడ్డిలతోపాటు, బిజెడి అధినాయకుడు నవీన్‌ పట్నాయక్‌లను సంప్రదించాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకులను సోనియాగాంధీ ఆదేశించినట్లు తెలిసింది.కాకపోతే ఇం కా ఏ కాంగ్రెస్‌ నాయకుడూ ఇప్పటివరకు ఈ ముగ్గురు నాయకులను కలిసినట్లు సమాచారం రాలేదు. ఎన్నికల తర్వాత బిజెపి గానీ, ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ గానీ కేంద్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే లేవని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ బుధవారంనాడు పేర్కొన్న విషయం తెల్సిందే. “ఆఖరి దశ ఎన్నికల్లో మేమున్నాం. ఈ దశలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నాను. నాకున్న అనుభవం బట్టి చూస్తే, కేంద్రంలో బిజెపి గానీ, లేదా ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ గానీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మోడీ కూడా రెండోసారి ప్రధానమంత్రి కావడం లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బిజెపియేతర, ఎన్‌డిఎయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతున్నది” అని ఆజాద్‌ మీడియాతో అన్నారు. కాంగ్రెస్‌ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదిరితే చాలా మంచిదని, అది రాబోయే ప్రభుత్వానికి, దేశానికి చాలా ఉపయుక్తమని చెప్పారు. ప్రధానిగా కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి అవుతారా? ఇతర పార్టీకి చెందిన వ్యక్తి అవుతారా? అన్న సమస్యపై ఇప్పుడే చర్చ అనవసరమని అభిప్రాయపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?