చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురి డిమాండ్
ప్రజాపక్షం/పెద్దపల్లి బ్యూరో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో భూ బకాసరులు రెచ్చిపోయి ప్రభుత్వ భూమిని అందినకాడికి దండుకుంటూ వాటిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తూ క్రయ విక్రయాలు జరుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందే భూఆక్రమణ జరగడం గమనార్హం. ఇంత జరిగినా ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మండల కేంద్రం నడిబొడ్డున సర్వేనెం.870లో 70ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉంది. మొదటగా ఎలిగేడు గ్రామంగా ఉండేది. తదుపరి మండల కేంద్రంగా ఏర్పడినప్పటి నుండి ఇదే భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎలిగేడు, లాలాపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ ఆర్అండ్బి అధికారులు రోడ్డును వేయడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించి భూ ఆక్రమణదారులు ఈ విలువైన భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో రెవెన్యూ అధికారులు ఇల్లు లేని పేదవారికి రెండు గంటల నివేశన స్థలం పట్టాలను ఇచ్చారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు భూ బకాసురులు దాదాపు 10 గుంటల స్థలాన్ని ఇండ్ల స్థలాల పేరిట కబ్జా చేశారు. ఈ పది గుంటల పైచిలుకు స్థలాలపై స్థానిక రెవెన్యూ కార్యాలయం నుండి ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండానే ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి లక్షల్లో అమ్ముకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు.
గ్రామస్తుల ఆగ్రహం
గత గ్రామపంచాయతీ కార్యవర్గం గృహ నిర్మాణ సమయంలో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకున్నా రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వకున్నా గ్రామపంచాయతీ పాలకవర్గం ల్యాండ్ పోజిషన్ సర్టిఫికెట్ లేకుండానే గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పై పలువరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, వ్యవసాయేతర అసైన్డ్ భూములు భూ బకాసురులు కబంధహస్తాల్లోకి వెళ్లిపోతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్న క్రమంలో, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తక్షణమే గుర్తించాలని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖ పేదలకు ఇచ్చిన భూమి రెండు గుంటలకు మించి ఉన్న భూముల వివరాలను రెవెన్యూ అధికారులు నమోదు చేయలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై గ్రామపంచాయతీ పాలకవర్గం ఎలా అనుమతులు ఇచ్చిందో, జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి సర్వేనెం.870లో అన్యాక్రాంతమైన ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకుని మండల అభివృద్ధికి తోడ్పడాలని గ్రామప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముందే ప్రభుత్వ భూమి కబ్జా
RELATED ARTICLES