తవ్విన కొద్దీ అక్రమార్కులు, అక్రమాలు

ఇఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురి అరెస్టు
13కు చేరిన నిందితుల సంఖ్య

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో తవ్విన కొద్దీ అక్రమాలు, అక్రమార్కులు బయటపడుతున్నారు. గత నెల 27న ఇఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సిహెచ్‌.దేవికరాణితో మొదలైన అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. తాజాగా సోమవారం కూడా ఎసిబి అధికారులు మరో ముగ్గురిని ఈ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టయిన వారిలో బాలనగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ సెంటర్‌ ఎండి డాక్టర్‌ చెరుకు అరవింద్‌ రెడ్డి, సూపర్‌వైజర్‌ కె.రామ్‌రెడ్డి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కె.లిఖిత్‌రెడ్డిలు ఉన్నారు. బాలనగర్‌లోని వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ సెంటర్‌పై ఎసిబి అధికారుల దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసిబి అధికారులకు కీలక డాక్యుమెంట్లు, పరికరాల కొనుగోళ్ల బిల్లులు లభించాయి. ఇఎస్‌ఐ కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు, బిల్లులు ఇక్కడ లభ్యమయ్యాయి. వీరు జాయింట్‌ డైరెక్టర్‌ పద్మతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఎసిబి అధికారుల విచారణలో తేలింది. అరవింద్‌రెడ్డి 2013 నుంచి ఇఎస్‌ఐ సొమ్ము కాజేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఇఎస్‌ఐకి పరికరాల సరఫరా చేయకున్నా చేసినట్లు బిల్లులు మంజూరు చేయించుకుని అందులో ఇటీవల అరెస్టు అయిన ఇఎస్‌ఐ డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్లకు వాటాల పంపకం చేసి పబ్బం గడిపారు. ఇక తక్కువ ధరకు ఉన్న పరికరాలకు వంద శాతం అధిక ధరలు సూచించి బిల్లులు దండుకున్నారు. సుమారు వీరు ఆరేళ్లలో రూ.16 కోట్ల మేర డబ్బులు దండుకున్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురు నిందితులపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం, ఫోర్జరీ, చీటింగ్‌, నేరపూరిత కుట్ర, విధులను దుర్వినియోగ పరచడం వంటి పలు సెక్షన్ల (120 (బి) రెడ్‌విత్‌ 34, 477 (ఎ) 465, 468, 471, 420) కింద కేసులు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. దీంతో ఇఎస్‌ఐ కుంభకోణంలో కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. వీరిలో ఏడుగురు ఇఎస్‌ఐ అధికారులు, ఉద్యోగులు కాగా ప్రైవేటు వ్యక్తులు ఆరుగురు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?