HomeNewsLatest Newsతలొగ్గిన కేంద్రం

తలొగ్గిన కేంద్రం

లేటరల్‌ ఎంట్రీ రద్దు చేయాలని యుపిఎస్‌సికి లేఖ

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర సర్కార్‌ తలొగ్గింది. తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో లేటరల్‌ ఎంట్రీ నియామక విధానాన్ని రద్దు చేయాలని యుపిఎస్‌సిని కోరింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం నాడు యుపిఎస్‌సి చైర్‌పర్సన్‌ ప్రీతీ సుడాన్‌కు లేఖ రాశారు. లేటరల్‌ ఎంట్రీ విధానంలో అణగారిన వర్గాలకు ప్రభుత్వ సర్వీసులో హక్కుగా ఉండాల్సినందున లేటరల్‌ ఎంట్రీ నియామక అడ్వర్టయిజ్‌మెంట్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ నెల 17న లేటరల్‌ ఎంట్రీ విదానంలో 45 జాయింట్‌ సెక్రెటరీలు, డైరెక్టర్‌లు, డిప్యూటీ సెక్రెటరీలను స్పెషలిస్ట్‌ పేరుతో ప్రభుత్వ విభాగాల్లో లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో నియమించేందుకు యుపిఎస్‌సి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఒబిసి, ఎస్‌సి,ఎస్‌టిల రిజర్వేషన్‌ల హక్కును పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యుపిఎస్‌సికి కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ రాసిన లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు సామాజిక న్యాయం మూలస్థంభం వంటిదని భావిస్తారని, చారిత్రక అన్యాయాలను సరి చేసేందుకు, అందరిని సమ్మిళితంగా తీసుకెళ్లేందుకు ప్రోత్సహిస్తుందనే అభిప్రాయం ఉన్నదన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులు స్పెషలిస్టులుగా భావిస్తారని, అవి సింగిల్‌ క్యాడర్‌ పోస్టులని, అందులో రిజర్వేషన్‌లకు అవకాశం లేదని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కల్పనపై ప్రధాని దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఈ విధానాన్ని సమీక్షించాలని, సంస్కరించాలని తెలిపారు. కాబట్టి లేటరల్‌ ఎంట్రీ నియామక విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యుపిఎస్‌సికి లేఖ రాశారు. లేటరల్‌ ఎంట్రీ విధానాన్ని వీరప్పమొయిలీ నేతృత్వంలోని రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్‌ సిఫార్సు చేసిందని, 2013లోని ఆరవ వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలలో కీలకమైన మంత్రుల సెక్రెటరీలుగా, యుఐడిఎఐ నాయకత్వంలో లేటరల్‌ ఎంట్రీ విధానాన్ని అమలు చేశారని గుర్తు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments