ముగ్గురు మృతి, మధ్యప్రదేశ్‌లో ఘటన
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రెండు సరుకు రవాణాలు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆమ్లోరీ మైన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలు, మరో ఖాళీ గూడ్స్ రైలు ఉదయం 4.40 ప్రాంతంలో ఘన్‌హరి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నట్లు సింగ్రౌలి అదనపు ఎస్‌పి ప్రదీప్ షిండే మీడియాకు వెల్లడించారు. ప్రమాదం అనంతరం ఒక రైలుకు చెందిన 14 బోగీలు, ఒక ఇంజిన్ పట్టాల నుంచి బయటకు వైదొలిగాయి. ఇంత వరకు ఇంజిన్ నుంచి మూడు మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదన్నారు. అయితే మృతులు ఇద్దరు డ్రైవరు ఒక పాయింట్స్ మ్యాన్ కావచ్చని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు బొగ్గు రవాణా చేస్తున్న జాతీయ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) ప్రమాదం జరిగిన ట్రాక్ నిర్వహణ బాధ్యతలు తీసుకుందన్నారు. డ్రైవర్ల తప్పిదం వల్ల లేదా సిగ్నలింగ్‌లో లోపాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు షిండే చెప్పారు. ఈ ట్రాక్ కేవలం బొగ్గు రవాణాకు మాత్రమే ఉపయోగిస్తుండడం వల్ల ప్రయాణికుల రైళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు.
ఢీకొన్న గూడ్స్ రైళ్లు
RELATED ARTICLES