HomeNewsNationalఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు

ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి సర్చ్‌ వారెంటుతో వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు, ఆయనను ప్రశ్నించిన వెంట నే అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా ఆప్‌ నాయకులు, కార్యకర్తలు కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకొని, ఇడికి వ్యతిరేంగా నినాదాలు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేజ్రీవాల్‌ చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన కొన్ని గంటల్లోనే ఇడి అధికారులు ఆయన నివాసానికి చేరుకోవడంతో అరెస్టుపై సందేహాలు మొదలయ్యాయి. ఇదే కేసులో, అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆ పార్టీ కీలక నేత సంజయ్‌ సింగ్‌సహా 15 మందిని ఇడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ ఎమ్మెల్సీ, బిఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితను ఇడి అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించారు. దీనితో, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు కూడా తప్పదన్న ఊహాగానాలే చివరికి నిజమయ్యాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, ఆయనను అరెస్టు చేయడం సులభం కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. కానీ, ఇడి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా భద్రత బలగాలు చేరుకున్నాయి. ఇలావుంటే, విచారణకు హాజరుకావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఇడి 9 పర్యాయాలు నోటీసులు పంపింది. రెండు సార్లు సమన్లు జారీ చేసింది. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ, దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారణకు హాజరుకాగలనని ఇటీవలే ప్రకటించారు. అదే సమయంలో, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఇడి కేసులు పెడుతున్నదని పేర్కొంటూ, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ప్రతికూలంగా తీర్పురావడం, ఆ తర్వాత ఇడి అధికారులు సర్చ్‌ వారెంట్‌తో ఆయన నివాసానికి చేరుకొని సోదాలు జరపడం వెంటవెంటనే జరిగాయి. సోదాలు నిర్వహించిన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తున్నట్టు ఇడి అధికారులు ప్రకటించారు. ఇడి కార్యాలయానికి వెళ్లే అన్ని దారులను పోలీసులు ముందుగానే మూసివేశారు. ఆయనను న్యాయ మూర్తి ముందు ఇప్పుడే హాజరు పరుస్తారా లేక శుక్రవారం కోర్టుకు తీసుకెళతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వం
అంతకు ముందు మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఇడి తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. చివరిసారి ఇచ్చిన నోటీసులకు గురువారం హాజరుకావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. తనకు జారీ అయిన సమన్లను సవాల్‌ చేస్తూ ఢిల్లీ సిఎం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని అడిగింది. అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ గురువారం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇడి తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సిఎంకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్‌ అభ్యర్థనపై ఇడిని వివరణ కోరింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. సమన్లను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటే దీన్ని ఏప్రిల్‌ 22న విచారిస్తామని తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీశ్‌ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్టయి జైల్లో ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments