ఢిల్లీ మతకలహాల కేసులో.. ఏచూరి తదితరుల పేర్లు చేర్చడం అణచివేత చర్య

సిపిఐ ఖండన
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరిలో సంభవించిన మతకలహాలపై అనుబంధ చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్‌ అభియాన్‌ నాకుడు యోగేంద్ర యాదవ్‌, ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌, ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌, చలన చిత్ర నిర్మాత రాహుల్‌ రాయ్‌ పేర్లు పొందుపర్చడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. కేంద్రహోంమంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఈ ప్రముఖ వ్యక్తుల పేర్లు చేర్చడం మన రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను పచ్చిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. కవ్వింపు ప్రసంగాలతో హింసను రెచ్చగొట్టిన బిజెపి నాయకులు కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి, ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికీ తిరస్కరిస్తున్న ఢిల్లీ పోలీసులు, సిఎఎ వ్యతిరేక నిరసనకారులకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన మహిళా కార్యకర్తలు సహా కార్యకర్తలను ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను అణచివేసే కుట్రపూరిత ప్రయత్నాలు బిజెపి కూటమి అసహన, నిరంకుశ పాలనా పద్ధతుల్లో భాగంగా పార్టీ వ్యాఖ్యానించింది. కొనసాగుతున్న అణచివేత చర్యలకు సరైన జవాబు ద్వారా అటువంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యంగా దాడికి వ్యతిరేకంగా గొంతెత్తాలని ప్రగతిశీల, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు సిపిఐ విజ్ఞప్తి చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?